buggana rajendranath reddy gadapa gadapaku programజగన్ ప్రభుత్వం సంక్షేమ పధకాల పేరుతో కుడి చేత్తో ప్రజలకు డబ్బు ఇచ్చి ఎడం చేత్తో తిరిగి వసూలు చేసుకొంటోందని ప్రతిపక్షాలు వాదిస్తుంటే అదంతా దుష్ప్రచారమని ముఖ్యమంత్రి, మంత్రులు ఖండిస్తున్నారు. అదే విషయం మీడియా చెపితే ‘ఎల్లో మీడియా’ అని ముద్రవేసి తప్పిచుకొంటున్నారు. అయితే ప్రజల నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు కదా?

గడప గడపకి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆదివారం సాయంత్రం నంద్యాల జిల్లా, డోన్ పట్టణంలో కంబాలపాడులోని 30,31 వార్డులలో పర్యటించినప్పుడు మహిళల నుంచి చేదు అనుభవం ఎదురైంది. అదీ వివిద పధకాల ద్వారా లబ్ది పొందిన మహిళలు ఆయన నిలదీయడం విశేషం.

ఓ మహిళని మంత్రిగారు పలకరించి ‘అన్ని పధకాలు అందుతున్నాయామ్మా? ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా?’ అని ప్రశ్నించగా పధకాలతో లక్ష రూపాయలు ఇచ్చిన్నట్లే ఇచ్చి ఇంటిపన్ను, చెత్త పన్ను, కరెంటు ఛార్జీలు, నిత్యావసర సరుకులు ధరలు పెంచేసి మా నుంచి రెండు లక్షలు పిండుకొంటున్నారు కదా?” అని ఎదురు ప్రశ్నించడంతో గణాంకాల మాంత్రికుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి షాక్ అయ్యారు.

మరో మహిళ “నాకు ఇద్దరు పిల్లలు ఉంటే ఒక్కరికే అమ్మఒడి పధకంలో డబ్బు ఇచ్చారు. సచివాలయానికి వెళ్ళి అడిగితే నా పేరు మీద 10 ఎకరాల పొలం ఉంది కనుక ఇవ్వడం లేదని చెప్పారు. నాకు ఒక్క ఎకరం కూడా లేదు. కానీ 10 ఎకరాలు ఉందని చెపుతున్నారు. కనుక ప్రభుత్వం లెక్కలో ఉన్న ఆ పదెకరాలు ఇప్పించండి,” అంటూ నిలదీసింది.

మరో మహిళ “జగనన్న వస్తే ఉద్యోగాలు వస్తాయన్నారు. ఆయన మాటలు నమ్మి మేము ముగ్గురం జగనన్నకు మూడు ఓట్లు వేశాము. మూడేళ్ళు గడిచిపోయాయి. మా ఇంట్లో ఒక్క ఉద్యోగమూ రాలేదు. పోనీ పధకాల కోసం దరఖాస్తు చేసుకొంటే ఏవో కొర్రీలు వేసి ఇవ్వడం లేదు. ఇలా అయితే మేము ఎలా బతకాలి?కనీసం సంక్షేమ పధకాలై ఇప్పిస్తే కుట్టు మిషను పెట్టుకొని బతుకుతాము,” అని అంది.

మంత్రిని నిలదీసిన వారందరూ ప్రతిపక్షాలకు చెందినవారు కారు. వారి వెనుక మీడియా కూడా లేదు. జగనన్న రాజ్యంలో సంక్షేమ పధకాల లీలలు, వాటితో తమ బతుకులు ఎలా వెలిగిపోతున్నాయో ఆ సాధారణ మహిళలు కళ్ళకు కట్టినట్లు చెప్పారు.

సంక్షేమ పధకాలు ఇస్తున్నా సామాన్య ప్రజలలో ఇంత అసంతృప్తి ఉన్నప్పుడు, వచ్చే ఎన్నికలలో వారందరూ మళ్ళీ వైసీపీకే ఓట్లు వేస్తారని, ఈసారి 175 సీట్లు తమకే వస్తాయని సిఎం జగన్మోహన్ రెడ్డి ఏవిదంగా భావిస్తున్నారో?తెలీదు కానీ జగన్ ప్రజలను మిధ్యలో ఉంచుతున్నారా లేక 175 సీట్లు గెలుస్తామని తానే మిధ్యలో ఉంటున్నారా?