buggana rajendranath reddy comments over suicide cases on sand scarcityఇసుక కొరత వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడానికి కూడా ఎందుకనో ఇష్టపడటం లేదు. పై పెచ్చు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిని హేళన చేస్తూ మంత్రులు మాట్లాడటం శోచనీయం. తాజాగా ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా అటువంటి ప్రకటనే చెయ్యడం గమనార్హం.

సోమవారం ఆయన ఢిల్లీలో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు చనిపోతున్నారనేది అవాస్తవమని అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మనుషులు ఏదో కారణంతో చనిపోతారని.. అది నిరంతర ప్రక్రియని పేర్కొన్నారు. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

సామాన్యుల బలిదానాలను నిరంతర ప్రక్రియ అంటూ తీసి పడేస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ప్రాణానానికి విలువ లేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇసుక కొరతను పరిష్కరించడానికి 14 నుండి 21 ఇసుక వారోత్సవాలు చెయ్యడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.

అలాగే ఇసుక కొరత తీరేవరకు అధికారులెవరూ సెలవులు పెట్టకూడదని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఇసుకను ప్రభుత్వం నిర్ణయించిన రేటు కంటే ఎక్కువకు అమ్మితే జరిమానా వాహనం సీజ్ చెయ్యడంతో పాటు రెండేళ్లు జైలు శిక్ష కూడా విధించేలా చట్టం తీసుకురానున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు.