Buggana -Rajendranath Reddy YSRCPకియా మోటార్స్ 2014 తరువాత భారతదేశంలో వచ్చిన అతిపెద్ద విదేశీ పెట్టుబడి. అది సాధించిన ఘనత ఎవరిదీ అంటే సహజంగా అందరూ చెప్పేది చంద్రబాబు నాయుడు అని (ఎన్నికల గెలుపోటములతో సంబంధం లేకుండా). అయితే ప్రతిపక్షంలో ఉండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్లాంటును తీవ్రంగా వ్యతిరేకించింది. రైతుల దగ్గర నుండి భూములు లాక్కున్నారని, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఇలా అనేక ఉద్యమాలు చేసింది. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పరిస్థితిలు మారిపోయాయి.

కియా మోటార్స్ క్రెడిట్ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పరితపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విన్నపంతోనే ఏపీలో కియా ప్లాంట్‌ ఏర్పాటు అయ్యిందని, ఈ విషయాన్ని 2007లోనే కియా ప్రకటించిందని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. బుగ్గన ఇచ్చిన స్టేట్మెంట్ చాలా హాస్యాస్పదంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఆయన చేసిన క్లెయిమ్ ను వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇది ఇలా ఉండగా కియా మోటార్స్ క్రెడిట్ ఎవరిది అనే చర్చ ఈ నాటిది కాదు. ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియా వల్లే అది సాధ్యమైందని, మోడీ స్వయంగా మాట్లాడి రప్పించారని బీజేపీ నాయకులు చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా కియా మోటార్స్ ప్లాంట్ మోడీ ఆ సంస్థ వారితో చర్చించి పట్టుకొస్తే, చంద్రబాబు నాయుడు దానిని ఉపయోగించుకుని స్కాములకు తెరతీశారని జగన్ చెప్పుకొచ్చారు. మరి బుగ్గన చెప్పినది నిజమా జగన్ చెప్పింది నిజామా?