Buggana Rajendranath Reddyఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరుసగా మూడోసారి బడ్జెట్‌ను ఆయన ప్రవేశపెట్టారు. 2021-22కు గాను 2,29,779 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆయన. గత ఏడాది బడ్జెట్ 2,24,789 కోట్లు కాగా ఈ ఏడాది దానికో ఐదు వేల కోట్లు పెంచి బడ్జెట్ ప్రవేశపెట్టింది జగన్ ప్రభుత్వం.

సంక్షేమ పథకాలకు పెద్ద పీఠ వేస్తూ బడ్జెట్ ఉంది. అయితే అభివృద్ధి విషయంలో నిరాశపరచింది అంటున్నారు చాలా మంది. రాష్ట్రంలోని మూడు ప్రధాన ప్రాంతాలకు సమన్యాయం చేస్తాం అంటూ అధికారంలోకి రాగానే మూడు రాజధానులను తెరమీదకు తెచ్చింది జగన్ ప్రభుత్వం. అమరావతి, విశాఖపట్నం, కర్నూల్ లను రాజధానులుగా ప్రకటించారు.

అయితే ఈ మూడు రాజధానుల అభివృద్ధి పేరిట 2,29,779 కోట్ల బడ్జెట్ కు గానూ ఒక్క రూపాయి కూడా బుగ్గన కేటాయించకపోవడం విశేషం. ఏదో పేరుకు రాజధాని హోదా ఇచ్చేసి అభివృద్ధి లేదు అంటే ఏం ఉపయోగం అంటూ ప్రాంతాలకు అతీతంగా ప్రభుత్వ తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.

“మాట్లాడితే మూడు రాజధానులను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి. కోర్టులు అడ్డుకుంటున్నాయి అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ వారు కుంటి సాకులు చెబుతారు. మూడు రాజధానులు ఆ హోదా రాకపోయినా తలో 1,000 కోట్లు ఖర్చు పెట్టి మీరు చేస్తామన్న సమగ్ర అభివృద్ధి చేస్తే ఎవరు కాదు అంటారు. అభివృద్ధి వికేంద్రీకరణ పై ప్రభుత్వం యొక్క నిజమైన చిత్తశుద్ధికి ఈ బడ్జెట్ నిదర్శనం,” అని వారు విమర్శిస్తున్నారు.