Buggana Rajendranath -Reddy Andhra Pradesh Budget 2019ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ అసెంబ్లీలో తొలిసారిగా రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అటు శాసనమండలిలో రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్ 2,27,974 కోట్లు కాగా 35,260 కోట్లు ద్రవ్య లోటు అని, 1,778 కోట్లు రెవెన్యూ లోటు అని తేల్చారు. బడ్జెట్ లో నవరత్నాల కోసం, ఇతర ఎన్నికల హామీల కోసం భారీగా కేటాయింపులు చెయ్యడం విశేషం.

ముఖ్యమంత్రికి సమస్యలు చెప్పుకునే కాల్‌ సెంటర్‌కు రూ. 73.33 కోట్లు, గ్రామ వాలంటీర్లకు రూ. 720 కోట్లు, గ్రామ సచివాలయ నిర్వహణకు రూ. 700 కోట్లు, మున్సిపల్‌ వార్డు వాలంటీర్లకు రూ. 280 కోట్లు, మున్సిపల్‌ సచివాలయాలకు రూ. 180 కోట్లు, వివిధ వర్గాల కల్యాణ కానుకల కింద దాదాపుగా 681 కోట్లు, వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పథకానికి రూ. 1740 కోట్లు కేటాయించారు. పెరిగిన పెన్షన్ల తో ఆ పద్దు కూడా ఈ సారి భారీగా పెరిగింది. దాదాపుగా 16000 కోట్లు పెన్షన్ల కింద ఖర్చు కానుంది.

వృద్ధులు, వితంతువుల పెన్షన్‌కు రూ. 12,801 కోట్లు, దివ్యాంగుల పెన్షన్లకు రూ. 2133.62 కోట్లు, ఒంటరి మహిళల పెన్షన్లకు రూ. 300 కోట్లు కేటాయించారు. అదే సమయంలో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకానికి రూ. 1740 కోట్లు, డ్వాక్రా మహిళల వడ్డీ లేని రుణాలకు రూ. 1140 కోట్లు, వైఎస్సార్‌ గృహ వసతి పథకానికి రూ. ఐదువేల కోట్లు, పట్టణ స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలకు రూ. 648 కోట్లు కేటాయించారు. రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధికి రూ. 3వేల కోట్లు, ప్రకృతి విపత్తుల నివారణ నిధికి రూ. 2002 కోట్లు, వైఎస్సార్‌ రైతు భరోసాకు రూ. 8750 కోట్లు, రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌కు రూ. 4525 కోట్లు మేర కేటాయింపులు ఉన్నాయి.