Chandrababu Naidu buggana rajendranath reddy - (2)జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల కలలకు తాత్కాలికంగానైనా బ్రేక్ పడింది. మండలిలోని తమ ఆధిక్యతతో టీడీపీ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించింది. దీనితో మూడు నాలుగు నెలల జాప్యం తప్పకపోవచ్చు. మండలిలో టీడీపీ బిల్లుని అడ్డుకున్న తరువాత మంత్రులు మీడియాతో మాట్లాడారు… ఈక్రమంలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఒకింత అసహనంతో విమర్శలు చేశారు.

“మండలి ఛైర్మన్ షరీఫ్ టీడీపీ కార్యకర్తల ప్రవర్తించారు. తప్పు అని తెలిసికూడా ఒత్తిడి తలొగ్గారు. నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకునే పెద్ద మనిషి మండలి గేలరీలో కూర్చుని మండలి చైర్మన్ మీద ఒత్తిడి చేసే ప్రయత్నం చేశారు. ఈరోజు చట్టసభలకే చంద్రబాబు మచ్చ తెచ్చారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే బ్లాక్ డే,” అని బుగ్గన ఆక్రోశం వ్యక్తం చేశారు.

అయితే బుగ్గన చాలా తెలివిగా తమకు అనుకూలంగానే మాట్లాడారు అని టీడీపీ వారు విమర్శిస్తున్నారు. “మండలి ప్రత్యక్ష కార్యక్రమాలను ప్రభుత్వం కావాలనే ఆపేసింది. చివరికి ఛైర్మన్ కార్యాలయం లో గానీ, ప్రతిపక్ష నేత కార్యాలయంలో కూడా ప్రసారాలు నిలిపివేసింది. అందుకే చంద్రబాబు మండలికి రావాల్సి వచ్చింది,” అని వారు అంటున్నారు.

“చంద్రబాబు మండలి గేలరీలో కూర్చోవడం తప్పు అన్నప్పుడు ముందు రోజు ఎంపీ విజయసాయి రెడ్డి, టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి ఎందుకు వచ్చినట్టు? మా ఎమ్మెల్సీలను ప్రలోభపెట్టారు అని మేము ఆరోపించాం. అందుకు నిదర్శనం గానే ఇద్దరు ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు,” అంటూ వారు ఆరోపించారు.