మేము పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్లు మూడున్నరేళ్ళుగా మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడుతూ రాష్ట్రాభివృద్ధికి బ్రేకులు వేసిన వైసీపీ ప్రభుత్వం వాటి గురించి రోజుకో కధ చెపుతూనే ఉంది. మూడు రాజధానులతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఒకరు చెపితే రాజధానిని చూసి పెట్టుబడులు రావని మరో మంత్రి చెపుతారు. మూడు రాజధానులంటే మూడు రాజధానులు కావని విశాఖ రాజధాని అని మరో మంత్రి చెపుతారు.
మరో వైసీపీ ఎమ్మెల్యే న్యాయ రాజధాని రాకుండా అడ్డుకొని రాయలసీమకి అన్యాయం చేస్తే సహించబోమని చెపుతూ తిరుపతిలో జనాలని రెచ్చగొట్టి ర్యాలీలు చేస్తుంటారు. మరోపక్క కర్నూలు న్యాయరాజధాని అని చెపుతున్నప్పటికీ, అక్కడికి హైకోర్టుని తరలించబోమని వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో చెపుతుంటుంది. విశాఖ రాజధాని చేయకపోతే విశాఖ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యామిస్తామని మరో మంత్రి హెచ్చరిస్తుంటారు. వారే అధికారంలో ఉన్నారు. వారే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలి. కానీ వారే ఈవిదంగా రోజుకో కధ చెపుతూ సభలు, ర్యాలీలు నిర్వహిస్తూ గర్జిస్తుంటారు… చివరికి అరసవెల్లి మహా పాదయాత్రకి బయలుదేరిన అమరావతి రైతులని కూడా విడిచిపెట్టలేదు! ఈ మూడు రాజధానులు కధ తెలుగు సీరియల్లాగా సాగిపోతూనే ఉంది. వైసీపీ నేతలు దానిలో రోజుకో కొత్త ఎపిసోడ్ జోడిస్తూనే ఉన్నారు.
తాజాగా ఏపీ ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇటీవల బెంగళూరులో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో మాట్లాడుతూ, “ఈ మూడు రాజధానులనే ప్రతిపాదనని వివరించడంలో తప్పు (మిస్ కమ్యూనికేషన్) జరిగింది. విశాఖపట్నంలో అన్ని వసతులు ఉన్నాయి కనుక అక్కడి నుంచే పరిపాలన సాగుతుంది. కర్ణాటకలోని గుల్బర్గాలో ఉన్నట్లే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాము. అమరావతిలో శాసనసభ, మండలి ఉంటాయి,” అని చెప్పారు.
ఇంతకాలం కర్నూలు న్యాయరాజధాని అంటే అక్కడికి హైకోర్టు వస్తుందని అందరూ భావిస్తున్నారు. కానీ మంత్రి బుగ్గన ఇప్పుడు అక్కడ హైకోర్టు బెంచ్ మాత్రమే ఏర్పాటు చేస్తానని కొత్త విషయం చెపుతున్నారు. అంటే రాయలసీమ ప్రజలని మోసం చేస్తున్నది ఎవరు? ప్రతిపక్షాలా వైసీపీ ప్రభుత్వమా?
మూడు రాజధానుల బిల్లుని శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టి రోజుల తరబడి చర్చించి ఆమోదముద్ర వేసిన తర్వాత ఇప్పుడు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈవిదంగా మాట్లాడటం విస్మయం కలిగిస్తుంది. సరే! వాటి గురించి ప్రజలు, మీడియా, ప్రతిపక్షాలు సరిగ్గా అర్దం అవుతోంది. చేసుకోలేకపోయాయి అనుకొన్నా హైకోర్టు ఆ బిల్లు చెల్లదని, శాసనసభకి ఆ అధికారం లేదని తేల్చి చెప్పింది కదా? ఆ తర్వాతే వైసీపీ ప్రభుత్వం ఆ బిల్లుని వెనక్కి తీసుకొందంటే అర్దం ఏమిటి?అది తప్పు అని అజ్ఞీకరించిన్నట్లే కదా?అయినా హైకోర్టు తీర్పుని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు వెళ్ళింది! సుప్రీంకోర్టు ఈ కేసుని విచారిస్తుండగానే సిఎం జగన్మోహన్ రెడ్డి త్వరలోనే నేను విశాఖకి షిఫ్ట్ అవుతాను. విశాఖపట్నమే ఏపీకి రాజధాని కాబోతోందని ఎలా చెప్పారు?చివరికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్వయంగా పార్లమెంటు సమావేశాలలో మూడు రాజధానుల కధ గురించి ప్రశ్నిస్తే, అమరావతినే ఏపీకి రాజధానిగా గుర్తిస్తున్నామని, మూడు రాజధానుల కధ మాకు తెలియదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది కదా?
రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్షాలు, అమరావతి రైతులు, హైకోర్టు, కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నా వైసీపీ నేతలు ప్రజలు ఏమనుకొంటారో అనే జంకు గొంకు లేకుండా ఇంకా మూడు రాజధానులంటూ ఇలా రోజుకో కధ చెపుతూనే ఉన్నారు. ఏపీకి రాజధాని లేకుండా చేసినందుకు ప్రజలు వారిని క్షమిస్తారా? వారే ఆలోచించుకోవాలి!