Budget 2019- Income tax limit raised to Rs 5 lakh -- Piyush Goyalమధ్యంతర బడ్జెట్ లో ఆదాయపు పన్ను పరిమితిని రూ.5లక్షలకు కేంద్రం పెంచింది అనే వార్తలు మీరు అంతటా ఇప్పటికే చూసి ఉంటారు. అయితే ఇది అందరికీ వర్తిస్తుంది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. బడ్జెట్ కూలంకషంగా చదివితే ఇందులో ఉన్న మర్మం అర్ధం అవుతుంది. వార్షిక ఆదాయం రూ.5లక్షల వరకూ ఉన్న వారు ఇకపై ఆదాయపుపన్ను చెల్లించనవసరం లేదు. అయితే ఐదు లక్షల కంటే ఎక్కువ సంపాదించే వారికి మాత్రం ఇందులో ఎటువంటి బెనిఫిట్ ఉండదు.

అటువంటి పక్షంలో గత సంవత్సరం మీరు దేని ప్రకారం టాక్స్ కట్టారు ఈ ఏడాది కూడా అలాగే కట్టాలి. స్టాండర్డ్‌ డిడక్షన్‌ పరిమితి రూ. 40 వేల నుంచి రూ.50 వేలకు పెంచారు. పోస్టల్‌, బ్యాంకు డిపాజిట్లపై టీడీఎస్‌ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. టీడీఎస్‌ పరిమితి రూ. 10 వేల నుంచి రూ.40 వేలకు పెంచుతూ కేంద్ర ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రి పీయూష్‌ గోయల్‌ బడ్జెట్‌లో ప్రకటించారు. ఇవి మాత్రం అన్ని పక్షాలకు మేలు చేస్తాయి. అయితే అది పరిమిత స్థాయిలోనే.

ఐదు లక్షల వార్షిక ఆదాయం ఉండే వారి శాతం గణనీయంగానే ఉంటుందని, వారికి ఇది ఊరటే అని ప్రభుత్వ వాదన. ఎన్నికల వేళ వారిని ఆకర్షించడానికి ప్రభుత్వానికి ఇది బాగానే ఉపయోగపడుతుంది అని వారి అంచనా. మరోవైపు రైతుల కోసం తెచ్చిన రైతుబంధు వంటి పథకం కూడా ఏదో పర్వాలేదు అనే అనిపించింది. అయితే బడ్జెట్ స్పీచ్ విని మోసపోయిన 5 లక్షల పైబడి ఆదాయం ఉన్న వారు మాత్రం దీనిని జీర్ణించుకోవడం చాలా కష్టం. ఇది బీజేపీకి ఎన్నికలలో ప్రతికూలంగా పరిణమించవచ్చు.