bsnl notices to apj abdul kalamగవర్నమెంట్ బడిలో చదువుకోవడానికి ముందుకు రాని విద్యార్ధులు, గవర్నమెంట్ జాబ్ ల కోసం ఎందుకు ఆసక్తి చూపుతారో అందరికి తెలిసిన విషయమే. పని తక్కువ… జీతమెక్కువ… అన్న చందంగా ప్రభుత్వ కార్యాలయాలు మారయానడానికి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఉదంతమే చెబుతోంది. కేవలం 1029 రూపాయల బిల్లు చెల్లించలేదని, అబ్దుల్ కలాం ఆస్తులను జప్తు చేసే నోటిసుల వరకు బీఎస్ఎన్ఎల్ అధికారులు వెళ్ళడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

2010లో తిరువనంతపురం టూర్‌లో భాగంగా కేరళ రాజ్‌భవన్‌లో రెండు రోజులు బస చేసిన సమయంలో పెండింగ్ పడ్డ 1029 రూపాయల నిమిత్తం నవంబర్ 18, 2015 వ తేదీన బీఎస్ఎన్ఎల్ అధికారులు నోటీసులు జారీ చేసారు. అక్కడితో ఆగితే ప్రభుత్వ అధికారుల పని తీరులో గొప్పేముంది… సదరు బకాయి చెల్లించని పక్షంలో కలాంకు చెందిన ఆస్తులను జప్తు చేయాలని కూడా తన సిబ్బందికి ఆ సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే నోటీసులు జారీ అయిన సమయానికి అబ్దుల్ కలాం గారు ‘కాలం’ చేసి నాలుగు నెలలు అయ్యింది. మీడియా వర్గాలకందిన ఈ ఉదంతం క్షణాల్లో దేశవ్యాప్తంగా తెలిసిపోయింది. చూడబోతుంటే మరింత రచ్చ జరిగేటట్లుందన్న విషయం గమనించిన కేరళ రాజ్‌భవన్ వర్గాలు షాక్‌కు గురై, ఆ బిల్లును తాము చెల్లిస్తామంటూ ప్రకటించాయి. పెండింగ్ బిల్లు వివాదం సమసిపోయినప్పటికీ, అధికారుల నిర్వాకంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.