Telangana-BRS-KCRతెలంగాణ సిఎం కేసీఆర్‌ తన బిఆర్ఎస్‌ పార్టీని ఇరుగుపొరుగు రాష్ట్రాలకి విస్తరించే ప్రయత్నంలో తొలి సభని విశాఖలో నిర్వహిస్తారని వార్తలు వచ్చినప్పటికీ, కేసీఆర్‌ తన తొలి రాష్ట్రేతర సభకి నిర్మల్ జిల్లాకి ఆనుకొని ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్‌ని ఎంచుకొన్నారు. ఫిభ్రవరి 5వ తేదీన అక్కడ బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించారు.

కనుక నిర్మల్ జిల్లాకి చెందిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఈ బహిరంగసభకి జనసమీకరణ, ఏర్పాట్ల భాద్యత అప్పగించారు. ఆయన శనివారం నాందేడ్‌ జిల్లా, కిన్వట్‌లోని అప్పారావుపేట గ్రామంలో పర్యటించి స్థానిక నేతలతో మాట్లాడారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పధకాలు మహారాష్ట్రలో కూడా అమలవ్వాలంటే కేసీఆర్‌ నాయకత్వంలో బిఆర్ఎస్‌ పార్టీని బలపరచాల్సిన అవసరం ఉందని వారికి నచ్చజెప్పి ఫిభ్రవరి 5న జరిగే సభకి భారీ ఎత్తున తరలివచ్చి సభని విజయవంతం చేయాలని కోరారు.

కేసీఆర్‌ తొలిసభకి నాందేడ్‌ని ఎంచుకోవడానికి బలమైన కారణాలే ఉన్నాయి. కొంతకాలం క్రితం ఆ జిల్లాలోని పలు గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, సభ్యులు తమ గ్రామాలని తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తూ రోడ్లపై ధర్నాలు చేశారు. పక్కనే ఉన్న తెలంగాణ గ్రామాలలో గ్రామీణులకి, ముఖ్యంగా రైతులకి తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పధకాలు అమలుచేస్తోందని కానీ మహారాష్ట్ర ప్రభుత్వం తాం కోసం ఏమీ చేయడం లేదని ఆరోపించారు. కనుక నాందేడ్‌లో కేసీఆర్‌కి మంచి ఆదరణ ఉందని స్పష్టమైంది. అదీగాక తెలంగాణలోని నిర్మల్, నిజామాబాద్‌ సరిహద్దు జిల్లాల నుంచి భారీగా సభకి జనాలని తరలించవచ్చు. కనుక కేసీఆర్‌ నాందేడ్‌ని ఎంచుకొన్నట్లు భావించవచ్చు.

అదే… విశాఖని ఎంచుకొంటే, కేసీఆర్‌ అనేక ప్రశ్నలకి సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఉద్యమ సమయంలో ఏపీ ప్రజలని ఉద్దేశ్యించి చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి, నేటికీ అపరిష్కృతంగా ఉన్న రాష్ట్ర విభజన సమస్యలపై సమాధానాలు, సంజాయిషీలు ఇచ్చుకోవలసి ఉంటుంది.

పైగా హైదరాబాద్‌కి, తెలంగాణలలో సరిహద్దు జిల్లాగా ఉన్న ఖమ్మంకి విశాఖపట్నం చాలా దూరంలో ఉంది. కనుక ఖమ్మం నుంచి జనాలని తరలించడం కూడా కష్టం. ఖర్చుతో కూడుకొన్న పని. ఇక ఏపీలో బిఆర్ఎస్‌ సభ పెడితే, టిడిపి కూడా తెలంగాణలో జోరు పెంచడం ఖాయం. దాని వలన కేసీఆర్‌ చేజేతులా ఇంటికి నిప్పంటించుకొన్నట్లవుతుంది. కనుక నాందేడ్‌ని ఎంచుకోవడం మంచి నిర్ణయమే అని భావించవచ్చు.