BRS_KCR_Kumara_Swamy_Karnataka_Electionsకర్ణాటక శాసనసభ ఎన్నికల షెడ్యూల్ బుదవారం ఉదయం జారీ అయ్యింది.  ఏప్రిల్ 13న నోటిఫికేషన్‌, ఏప్రిల్ వరకు నామినేషన్లు దాఖలు, మే 10వ తేదీన పోలింగ్, 13వ తేదీన ఓట్ల లెక్కించి వెంటవెంటనే ఫలితాలు వెల్లడిస్తారు. కర్ణాటకలో మొత్తం 224 శాసనసభ స్థానాలకు మే 10వ తేదీన ఒకేసారి ఎన్నికలు జరుగనున్నాయి.

కర్ణాటక శాసనసభకు ఎన్నికలు జరిగితే వాటితో తెలంగాణ సిఎం కేసీఆర్‌కు ఏం సంబంధం అనుకోవచ్చు. ఆయన బిఆర్ఎస్‌ పార్టీతో జాతీయ రాజకీయాలలో ప్రవేశించిన సంగతి తెలిసిందే. ముందుగా కర్ణాటక శాసనసభ ఎన్నికలలో తమ పార్టీ పోటీ చేస్తుందని కేసీఆర్‌ ప్రకటించారు. తన జాతీయ రాజకీయ ప్రవేశానికి మొదటి నుంచి మద్దతు ఇస్తున్న కర్ణాటకలోని కుమారస్వామి నేతృత్వంలోని ప్రతిపక్ష జేడీఎస్ పార్టీతో కలిసి పోటీ చేస్తామని కేసీఆర్‌ చెప్పారు.

ప్రధాని నరేంద్రమోడీ, బిజెపిలపై కత్తులు నూరుతున్న కేసీఆర్‌, ముందుగా కర్ణాటకలో అధికార బిజెపిని గద్దె దించి కుమారస్వామిని గద్దెనెక్కిస్తానని శపధం చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో దేశంలో అన్ని బిజెపియేతర పార్టీలను కూడగట్టుకొని ప్రధాని నరేంద్రమోడీని గద్దె దించి తాను ఆ పదవి చేపట్టాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. కనుక దేశంలో అన్ని రాష్ట్రాలలో మిత్రపక్షాలకు తన శక్తిసామర్ధ్యాలు నిరూపించుకొని, తనను నాయకుడిగా అంగీకరింపజేసేందుకు, కేసీఆర్‌కు ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలోకి విజయవంతంగా ప్రయాణించగలరా లేదా అని తేల్చుకోవడానికి ఈ ఎన్నికలు చాలా కీలకం కానున్నాయి.

అయితే జేడీఎస్‌తో సీట్ల సర్దుబాటు విషయంలో కేసీఆర్‌తో కుమారస్వామి విభేదించారని, అందుకే కేసీఆర్‌ నిర్వహిస్తున్న బిఆర్ఎస్‌ సభలకు కుమారస్వామిని పిలవడంలేదని లేదా ఆయన హాజరుకావడం లేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇవి నిజమనుకొంటే, కేసీఆర్‌ కర్ణాటకలో ఒంటరి పోరాటం చేయాల్సి ఉంటుంది పైగా మిత్రపక్షమనుకొన్న జెడిఎస్ పార్టీతో కూడా పోరాడవలసి ఉంటుంది.

ఒకవేళ ఏ కారణం చేతయినా బిఆర్ఎస్‌ పార్టీ కర్ణాటక ఎన్నికలలో పోటీ చేయకపోతే, కేసీఆర్‌వన్నీ ప్రగల్భాలే అని ప్రతిపక్షాలు ఎద్దేవా చేయడం ఖాయం. కనుక ఎట్టి పరిస్థితులలో బిఆర్ఎస్‌ పార్టీ కర్ణాటకలో పోటీ చేయడం ఖాయమనే భావించవచ్చు. ఎలాగూ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది కనుక నేడో రేపో కేసీఆర్‌ లేదా కుమారస్వామి పొత్తులు, పోటీ గురించి స్పందించక తప్పదు. అప్పుడు పూర్తి స్పష్టత వస్తుంది.