KCR_Caste_Politicsతెలంగాణ సిఎం కేసీఆర్‌ ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా అక్కడి సభలో ప్రజలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మనం అందరం కలిసిమెలిసి పనిచేస్తూ మన రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేసుకొన్నాము. కానీ బిజెపి ప్రజల మద్య కులమతాల చిచ్చు రగిలించి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. ఈ కులమతాల పిచ్చిలో పడితే మన రాష్ట్రం, దేశం కూడా తాలిబన్ల రాజ్యంగా మారిపోయే ప్రమాదం ఉంటుంది,” అని అన్నారు.

తెలంగాణలో కులమతాలు వద్దని చెపుతున్న కేసీఆర్‌, ఆ కుల రాజకీయాలతోనే ఆంద్రాలో ప్రవేశించడానికి సన్నాహాలు చేసుకొంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రజలు కులాలవారీగా చీలిపోయి ఉన్నారని, వారిపై కులరాజకీయాల ప్రభావం చాలా ఎక్కువగా ఉందని గ్రహించిన కేసీఆర్‌, రాష్ట్రంలో రాజకీయ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న కొందరు కాపు నేతలని హైదరాబాద్‌కి రప్పించుకొని వారిని తన బిఆర్ఎస్‌లో చేర్చుకొన్నారు. వారిలో కాపు నాయకుడు తోట చంద్రశేఖర్‌ని ఏపీ బిఆర్ఎస్‌ అధ్యక్షుడుగా నియమించుకొన్నారు.

కులమతాలు వద్దని చెపుతున్న కేసీఆర్‌ ఏపీలో ముందుగా కాపులపైనే ఎందుకు దృష్టి పెట్టారు?అంటే వారు జనసేన, టిడిపిలవైపు మొగ్గు చూపితే వైసీపీకి నష్టపోతుంది కనుక! గత ఎన్నికలో వైసీపీని గెలిపించేందుకు సహాయసహకారాలు అందించిన కేసీఆర్‌, ఈసారి కూడా అదే చేయబోతున్నారు. కనుక వైసీపీ కోసమే కాపుల ఓట్లని చీల్చేందుకు కేసీఆర్‌ చంద్రశేఖర్ వంటి కాపు నేతల ద్వారా పావులు కదుపుతున్నారని భావించవచ్చు.

కేసీఆర్‌ ఏపీలో ఏం సాధించినా, సాధించకపోయినా ఆయన ఏపీలో అడుగుపెడితే చాలు… వైసీపీ ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ ప్రజలలో ఆంద్రా సెంటిమెంట్ రగిలించి దానితో లబ్దిపొందేందుకు ప్రయత్నించడం ఖాయమే. కనుక ఆ విదంగా కూడా కేసీఆర్‌ వైసీపీకి, దాని అధినేత సిఎం జగన్మోహన్ రెడ్డికి చాలా తోడ్పడబోతున్నారని చెప్పవచ్చు.