Brother Anil Kumarవైఎస్సార్‌టిపి అధినేత్రి వైఎస్ షర్మిల భర్త, క్రైస్తవ మత భోదకుడు బ్రదర్ అనిల్ సోమవారం విశాఖలో ఓ హోటల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కుల సంఘాల నేతలతో సమావేశం కావడం రాష్ట్ర రాజకీయాలలో మరో కొత్త ఆధ్యాయానికి ప్రారంభంగా కనిపిస్తోంది.

వారందరూ తన అభ్యర్ధన మేరకే 2014 ఎన్నికలలో వైసీపీకి ఓట్లేసి జగన్ ముఖ్యమంత్రి కావడానికి తోడ్పడ్డారని, కనుక వారి సమస్యలను విని తెలుసుకోవలసిన బాధ్యత తనకుందని బ్రదర్ అనిల్ సమర్ధించుకోవడం బాగానే ఉంది. వారి సమస్యలపై నేరుగా సిఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి మాట్లాడుతానని చెప్పడం కూడా బాగానే ఉంది. కానీ ఆయా సామాజిక వర్గాల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వారు రాజకీయ పార్టీ పెట్టుకొంటే వారికి మద్దతు ఇస్తానని బ్రదర్ అనిల్ చెప్పడమే ఆలోచించవలసిన విషయం.

వైఎస్సార్‌టిపితో వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాలలోకి ప్రవేశించినప్పటి నుంచి వినబడుతున్న ఒకే ఒక ప్రశ్న ఏపీకి చెందిన ఆమె ఏపీలో పార్టీ పెట్టుకోకుండా తెలంగాణలో ఎందుకు పెట్టుకొని తిరుగుతున్నారని. దానికి ఆమె చెప్పిన సమాధానాన్ని తెలంగాణలో ఎవరూ నమ్మకపోయినా, ఆమె అన్న జగన్‌తో విభేదించి వచ్చారనే ఊహాగానాలు నేటికీ వినిపిస్తునే ఉన్నాయి.

ఇప్పుడు బ్రదర్ అనిల్ ఏపీలో కొత్త పార్టీ అంటూ మాట్లాడటం గమనిస్తే బహుశః భార్య వైఎస్ షర్మిల సూచన మేరకే ఆయన ఏపీలో ఆమె రంగప్రవేశానికి వేదిక సిద్దం చేస్తున్నారేమో?అనే సందేహం కలుగకమానదు. ఒకవేళ ఇదే నిజమైతే, వచ్చే ఎన్నికలలో టిడిపి, బిజెపి, జనసేనలకు చెక్ పెట్టేందుకు రంగం సిద్దం అవుతోందా లేక ఒకవేళ ఏపీలో అన్న పరిస్థితి తారుమారు అయితే వైఎస్ షర్మిల చేతికి పగ్గాలు అప్పగించి అధికారం ‘బయటకు’వెళ్ళిపోకుండా కాపాడుకోవాలనే ప్రయత్నామా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.