Brochevarevarura release in june సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమా విడుదలయ్యాక టాలీవుడ్ లో సరైన సినిమాలే రిలీజ్ కాలేదు. ఒకటి రెండు సినిమాలు వచ్చినా నిలబడలేదు. ఇప్పుడు జూన్ 28న ఏకంగా మూడు సినిమాలు విడుదల కాబోతున్నాయి. రాజశేఖర్ నటించిన కల్కి, ఆది నటించిన బుర్రకథ ఇప్పటికే ఆ రోజున విడుదల అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా శ్రీ విష్ణు నటిస్తున్న బ్రోచేవారెవరురా కూడా అదే రోజున విడుదలకు సిద్ధం అవుతుంది. ఒకే రోజు మూడు చిన్న సినిమాలు రావడంతో ఓపెనింగ్స్ దెబ్బ తినడం ఖాయం.

ఈ మూడు సినిమాలలో కల్కి, బ్రోచేవారెవరురా మీద మంచి అంచనాలే ఉన్నాయి. వచ్చే ఫ్రైడే తెలుగు బాక్స్ ఆఫీసు వద్ద పెద్దగా చెప్పుకోదగిన సినిమాలు ఏమీ విడుదల కావడం లేదు. ఒక సినిమా అప్పుడు విడుదల చేసుకోవచ్చు కానీ లేదు లేదు మేము గుంపుగా నే వస్తాం అంటున్నారు మన నిర్మాతలు. పై ఫ్రైడే (జూన్ 21) రోజున మల్లేశం, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులలో డీసెంట్ అంచనాలు ఉన్నాయి.

మరోవైపు జులైలో మీడియం బడ్జెట్ సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. జులై 5న సమంత ఓ బేబీ విడుదల అవుతుంది. ఆ పై వారం రామ్ – పూరి జగన్నాధ్ ‘ఇస్మార్ట్ శంకర్’ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. నెలాఖరున (జూన్ 28న) విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది. తెలుగు, తమిళ, మలయాళం భాషలలో ఒకేసారి డియర్ కామ్రేడ్ వస్తుంది. ఇవే కాకుండా నిన్ను వీడని నీడను నేడే, రాక్షసుడు వంటి చిత్రాలు కూడా జులైలోనే వస్తున్నాయి.