Bribe Corruption with 2000 rupees notes‘చేయి తడిపితే గానీ ఇండియాలో ఏ పని కాదన్నది’ బహిరంగ సత్యమే. ఎన్ని రూల్స్, ఎంత కఠినతరమైన శిక్షలు ప్రవేశపెట్టినా… లంచం అన్న మాట లేకుండా కార్యం ముగియదన్నది అందరూ అంగీకరించే వాస్తవం. మరి ఇప్పుడేమో సంకట స్థితి నెలకొంది. పని చేయించుకునే వాళ్ళు ఎంత కావాలంటే అంత లంచం ఇవ్వడానికి సిద్ధమైనా… అధికారులు మాత్రం తీసుకోని పరిస్థితులు నెలకొన్నాయి. మోడీ నిర్ణయంతో కుదేలైన ఈ లంచగొండి రాయుళ్ళంతా సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.

ప్రత్యామ్నాయ మార్గాలుగా బంగారం, ఆస్తులు ఇతరత్రా మార్గాలు ఉండడం ఒకటైతే… పని ప్రస్తుతం కానిచ్చినా… పైకం మాత్రం కొత్త నోట్లు మార్చిన పిదప ఇవ్వాలని, దానికి ఓ నాలుగైదు నెలల సమయం గడిచినా పర్లేదు గానీ, రద్దు చేయబడిన పాత నోట్లు మాత్రం వద్దంటే వద్దంటున్నారని మీడియా వర్గాలలో ప్రసారమవుతున్న కధనాలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే… సమయం ఆలస్యమైనా గానీ, లంచం అనే మాట నుండి ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడం..!

ఈ లంచగొండి రాయుళ్ళల్లోనే మరో విచిత్రమైన ఆలోచనలు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు లంచాల రూపంలో నొక్కేసిన మొత్తాలను తిరిగి ఇచ్చేస్తున్నారట. ఇదేదో సంఘసేవ చేస్తున్నారని భావించవద్దు. తమకు ఎవరైతే పెద్ద మొత్తాలలో లంచాలను సమర్పించారో వారికే తిరిగి ఆ పెద్ద మొత్తాలను ఇచ్చేసి, కొత్త నోట్లు వచ్చిన తర్వాత చెల్లించాలని ఆదేశిస్తున్నారట. ఇందులో ఏ మాత్రం మార్పు వచ్చినా తదుపరి ఫైల్ పై ప్రభావితం పడుతుందని ఖచ్చితంగా చెప్పి మరీ ఇస్తున్నట్లుగా ప్రసారమవుతున్న కధనాలు సామాన్య జనులను అవాక్కు చేస్తున్నాయి.