brand-babu-vs-chila-sow-vs-goodachariఈ ఏడాది ఫస్టాఫ్ టాలీవుడ్ కు ప్రతికూల ఫలితాలను అందించింది. సంక్రాంతి సినిమాలు నిరాశపరచగా, సమ్మర్ మాత్రం పర్వాలేదనిపించింది. సెకండాఫ్ లో ‘అరవింద సమేత, రోబో 2.0’ మినహా పెద్ద సినిమాలు బరిలో లేకపోవడంతో, చిన్న, మోస్తరు చిత్రాలదే రాజ్యం. అందులోనూ రాబోయే ఆగష్టులో విలక్షణమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. మొదటి వారం నుండి చివరి వారం వరకు… నాలుగు వారాల్లోనూ విడుదలవుతోన్న సినిమాల విజయం పట్ల చిత్ర యూనిట్ తో పాటు ప్రేక్షకులలోనూ నమ్మకాలు ఉన్నాయి.

మొదటి వారంలో ఆగష్టు 3వ తేదీన “గూడచారి, ఛి||ల||సౌ||, బ్రాండ్ బాబు” సినిమాలు విడుదల కానుండగా, ఈ మూడు సినిమాల ట్రైలర్లకు కూడా వీక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా ‘గూడచారి’ హాలీవుడ్ స్థాయి మేకింగ్ తో ముందు వరుసలో ఉండగా, ‘ఛి||ల||సౌ||’ యూత్ లవ్ ఎంటర్టైనర్ గా బరిలోకి దిగనుంది. ఇక మారుతీ బ్రాండ్ వినోదాన్ని ‘బ్రాండ్ బాబు’ అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ మూడు విలక్షణ సినిమాలు ఒకే రోజు విడుదల కానుండడం ప్రేక్షకులకు పండగ లాంటి విషయమే.

ఇక ఫస్ట్ లుక్ నుండి ఇంప్రెస్ చేస్తూ వస్తోన్న దిల్ రాజు – నితిన్ ల “శ్రీనివాస కళ్యాణం” సినిమా ఆగష్టు 9న విడుదల కానుంది. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా టీజర్, సాంగ్స్ కూడా ప్రేక్షకులను విశేషంగా అలరించడంతో, పాజిటివ్ నోట్ తో విడుదల కానుంది. మరుసటి వారం ఆగష్టు 15వ తేదీన రిలీజ్ కాబోయే “గీత గోవిందం” గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే కావల్సినంత బజ్ ఉంది, ట్రేడ్ వర్గాలలో క్రేజ్ కూడా అలాగే ఉంది.

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా “గీత గోవిందం” అప్పుడే సక్సెస్ కొట్టేసినంత ఆనందంలో చిత్ర యూనిట్ ఇటీవల ఆడియో వేడుకలో కనిపించింది. ఆ మరుసటి వారం ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన “నీవెవరో” విడుదల కానుంది. లవ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా సరికొత్తగా ఉండడంతో, ఈ టీజర్ ఫస్ట్ లుక్ లోనే అందరినీ ఆకర్షించింది. ‘రంగస్థలం’ తర్వాత ఆది చేస్తోన్న స్ట్రెయిట్ మూవీ కావడంతో, మార్కెట్ వర్గాల్లోనూ ఈ సినిమా ఫలితంపై ఆసక్తి నెలకొంది.

ఇక ఫైనల్ టచ్ ఇచ్చేందుకు అక్కినేని వారసుడు నాగచైతన్య “శైలజారెడ్డి గారి అల్లుడు”గా 31వ తేదీన రంగప్రవేశం చేయనున్నాడు. మారుతీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఫుల్ టైం ఎంటర్టైనర్ గా తెరకెక్కిందని టాక్. ఫస్ట్ టీజర్ కూడా రిలీజ్ కాని ఈ సినిమాపై ఇండస్ట్రీ జనాల్లో పాజిటివ్ టాక్ ఉంది. మొదటి వారం ‘బ్రాండ్ బాబు’తో మారుతీ ఎంట్రీ ఇస్తూ… చివరి వారం ‘శైలజారెడ్డి గారి అల్లుడు’తో మారుతీనే ఆగష్టును ముగిస్తున్నాడు. ఈ మస్త్ మస్త్ మూవీస్ అన్నీ సక్సెస్ అయ్యి, ప్రేక్షకులకు వినోదాన్ని, నిర్మాతలకు కాసులను కురిపించాలని ఆశిద్దాం.