Brahmotsavam-A-Aa-competitionప్రస్తుతం ఇదే ప్రశ్న ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులతో సినీ ప్రేమికులను వేధిస్తోంది. దీనికి సమాధానం లభించాలంటే మరో మూడు రోజుల పాటు నిరీక్షించాలి. అయితే ట్రేడ్ వర్గాల్లో ఫాలో అయ్యే కొన్ని సెంటిమెంట్స్ ప్రకారం ఆయా సినిమాల జాతకాలను ముందుగానే అంచనా వేస్తారు. శ్రీకాంత్ అడ్డాల – ప్రిన్స్ మహేష్ బాబు కాంభినేషన్లో ఇంతకుముందే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఉండడంతో… ప్రస్తుత ‘బ్రహ్మోత్సవం’పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే మహేష్ సినీ ట్రాక్ రికార్డ్ ను పరిశీలిస్తే… రెండవ సారి దర్శకత్వం వహించిన దర్శకుల జాబితాలో ఒక్క పూరీ జగన్నాధ్ తప్ప మరే దర్శకుడు ప్రిన్స్ కు హిట్ ఇవ్వలేకపోయారు. ‘ఒక్కడు’ తర్వాత ‘అర్జున్’తో గుణశేఖర్ యావరేజ్ మార్క్ వరకే చేరుకోగా, ‘అతడు’ తర్వాత ‘ఖలేజా’ను బాక్సాఫీస్ బరిలో నిలపలేకపోయాడు. అలాగే ‘దూకుడు’ తర్వాత శ్రీనువైట్ల ‘ఆగడు’ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకున్నాడో అందరికీ తెలిసిందే. అయితే ‘పోకిరి’ ప్రభంజనం తర్వాత ‘బిజినెస్ మెన్’తో హిట్ రేంజ్ ను ఇచ్చిన ఘనత ఒక్క పూరీకే దక్కింది.

మరి శ్రీకాంత్ అడ్డాల ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు? పూరీ సరసన నిలుస్తాడా? లేక మరోవైపు చేరతారా? అన్నది మరికొద్ది రోజుల్లో తేలబోతోంది కానీ, పూర్తి స్థాయి కుటుంబ కధా చిత్రంగా తెరకెక్కిన ‘బ్రహ్మోత్సవం’ టార్గెట్ ఫ్యామిలీ ఆడియన్స్ కావడం ప్రధాన ప్లస్ పాయింట్. ‘పోకిరి’ సినిమా తర్వాత… అంటే పదేళ్ళ విరామం తర్వాత ప్రిన్స్ నటించిన ఓ సినిమా వేసవి సెలవుల సమయంలో విడుదల అవుతోంది. మహేష్ సినిమాలకు పట్టం కట్టే ఫ్యామిలీ ప్రేక్షకులే ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు కొండంత అండ. ఏ విధంగా చూసినా బాక్సాఫీస్ బరిలో నిలవడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్న ‘బ్రహ్మోత్సవం’ రియల్ రిజల్ట్ కోసం… చూస్తూనే ఉండండి..!