Brahmotsavam- Flopustavamగత శుక్రవారం నాడు విడుదలైన ప్రిన్స్ మహేష్ బాబు “బ్రహ్మోత్సవం” సినిమా ఫలితం పట్ల ఎంతమంది ఆనందంగా ఉన్నారో ఒక్కొక్కరుగా వెలుగు చూస్తున్నారు. సాధారణ సినీ ప్రేక్షకుల్లో ఉన్న ఉద్వేగ భావాల రీత్యా… అభిమానులు – అభిమానుల మధ్య వాగ్వివాదాలు, ఆరోపణలు, రికార్డులు అంటూ ఒకరిపై మరొకరు ఆధిపత్య పోరాటాలు చేసుకుంటూ ఉంటుంటారు. ఇది ఈనాడు ప్రారంభమైన విషయం కాదు. ఒకప్పుడు వీధి గట్ల మీద చేసుకునే ఈ ముచ్చట్లకు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమా అంటూ ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక అయ్యింది.

విజ్ఞానాన్ని ఎలా వినియోగించుకుంటే అలా ఉపయోగపడుతుంది. అలాగే మన సాధారణ సినీ అభిమానులు ఒకరిపై మరొకరు సెటైర్లు వేసుకోవడానికి లేదా ఒకరిని మరొకరు నిందించుకోవడానికి, ఒక హీరో అభిమానులు మరో హీరోను తక్కువ చేసి చూపించడానికి వినియోగించుకుంటున్నారు. ఇదంతా సోషల్ మీడియాలో ఒక భాగమైంది. ఈ క్రమంలో తాజాగా “బ్రహ్మోత్సవం” సినిమాపై ప్రత్యర్డులు వేసిన కొన్ని పోస్టింగ్స్ ను క్రోడీకరించుకుని, ఒక ఆంగ్ల దినపత్రిక ‘బ్రహ్మోత్సవం’పై ఒక కధనాన్ని ప్రచురించింది. సోషల్ మీడియాలో జరిగిందంటూ రాసిన ఈ కధనంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఒక సాధారణ పౌరుడి మాదిరే సామజిక బాధ్యత గల ఒక జాతీయ దినపత్రిక రాయడాన్ని ఒక్క ప్రిన్స్ అభిమానులే కాదు, ఇప్పటివరకు ‘బ్రహ్మోత్సవం’ సినిమాపై విమర్శలు కురిపించిన ప్రత్యర్ధి హీరోల అభిమానులు సైతం మండిపడుతున్నారు. దీంతో ‘వూయ్ లవ్ మహేష్ బాబు, ప్రైడ్ ఆఫ్ మహేష్ బాబు’ అంటూ జాతీయ వ్యాప్తంగా ట్రెండింగ్ కు శ్రీకారం చుట్టారు. మాలో మేము ఎన్నైనా అనుకుంటాం గానీ, ఒక దినపత్రిక కనీస నైతికత లేకుండా ప్రచురించడాన్ని అందరూ తప్పుపట్టడం ఆహ్వనించదగ్గ పరిణామం. ఈ ఉదంతం ‘పిల్లి-రొట్టె’ కధను గుర్తు తెస్తోంది.

అయితే, మహేష్ బాబు సినిమా ప్రభావం బహుశా ఈ రేంజ్ లో ఉంటుందని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. ఈ కధనం చూస్తుంటే… ‘బ్రహ్మోత్సవం’ సినిమా పరాజయం పాలైనందుకు, వీళ్ళంతా పొందే పైశాచిక ఆనందం ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. సినిమా బాగోలేదని ఒక విశ్లేషకుడిగా ఎన్ని విమర్శలైనా చేయవచ్చు. కానీ, ఒక హీరోను తక్కువ చేయాలనే తలంపుతో కధనాలు ప్రచురితం చేయడం, ఫోటోలను వేయడం అనేది కేవలం వారి భావాలను బయట పెడుతుంది తప్ప… సదరు హీరోకు ఎలాంటి మచ్చను తీసుకురాకపోవచ్చు.

ఎందుకంటే… ఒక సినిమా ఫ్లాప్ లో కధానాయకుడి బాధ్యత ఎంత ఉందో బహిర్గతంగా చెప్పిన హీరో మహేష్. అలాగే వివాదాలకు దూరంగా జీవితం సాగించే మహేష్ ను ఏకరువు పెట్టాలనే ప్రయత్నం కేవలం… వారి దృష్టి లోపాన్ని సూచిస్తుంది తప్ప, మహేష్ కెరీర్ పై గానీ, మహేష్ వ్యక్తిగత జీవితంపై గానీ ఎలాంటి ప్రభావితం చూపలేదన్న విషయాన్ని గమనించాలి. హీరోలకు ఫ్లాప్ లు కొత్త కాదు, ‘బాబా’ సినిమా తర్వాత రజనీకాంత్ ఏ రేంజ్ లో పుంజుకున్నారో అందరికీ తెలిసిన విషయమే. ఒక్క రజనీ ఏముంది… ఏ హీరో చరిత్ర చూసినా… ఇంతే..! ‘ఖలేజా’ ఫ్లాప్ తర్వాత ‘హ్యట్రిక్’ అందుకున్న మహేష్ కేరీరే ఒక ఉదాహరణ.

ప్రతి ఒక్కరి జీవితంలో గెలుపోటములు సహజమే! అందుకు ఎవరూ మినహాయింపు కాదు… అదంతా జీవితంలో ఒక భాగం! కానీ, ఓటములను అలుసుగా తీసుకుని బురద జల్లాలనుకుంటే మాత్రం… వారు నిజంగా ‘బ్రహ్మోత్సవం’ సినిమా చూడాల్సిందే. ఎందుకంటే… ఈ సినిమా ఎలా ఉన్నా… ఈ సినిమాలో మనుషుల గురించి దర్శకుడు చెప్పాలనుకున్న “విషయం” మాత్రం… ఇలాంటి వారి గురించే..!