brahmotsavam-mahesh-babu‘బాహుబలి’ సినిమా తర్వాత తెలుగు సినిమా దశ తిరిగింది. టాలీవుడ్ మార్కెట్ అమాంతం పెరిగిందన్నది ఎంత వాస్తవమో, ‘బాహుబలి’ కలెక్షన్స్ ను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు చేతులు కాల్చుకుంటున్నారన్నది కూడా అంతే వాస్తవం. ‘బాహుబలి’ విడుదలైన తర్వాత వచ్చిన మరో పెద్ద సినిమా ‘శ్రీమంతుడు’ కూడా భారీ హిట్ అందుకుంది. ‘బాహుబలి’ సినిమా రికార్డులు మినహా అన్ని తుడిచి పెట్టుకుపోవడంతో మళ్ళీ టాలీవుడ్ లో రికార్డుల గోలకు తెరలేపింది.

అయితే ‘బాహుబలి, శ్రీమంతుడు’ సినిమాలు పెంచిన మార్కెట్ తో ఇటీవల కాలంలో ‘ప్రీ రిలీజ్’ బిజినెస్ అనే మాట ఎక్కువగా వినపడుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమా విడుదలకు ముందు దాదాపు 70 కోట్ల బిజినెస్ జరిగిందని అంతా చెప్పుకున్నారు. నిజానికి తెలుగు సినిమా పరిధికి ఇది రికార్డే. అయితే, ఈ ప్రీ రిలీజ్ సినిమా బిజినెస్ ఎవరికి ఉపయోగం అంటే… ఒక్క నిర్మాతకు మాత్రమే అన్న సమాధానం వస్తుంది.

అసలు ప్రీ రిలీజ్ బిజినెస్ కు అర్ధం ఎలా ఉండాలి అంటే… ఒక సినిమా ఎంత అట్టర్ ఫ్లాప్ అయినా, ప్రీ రిలీజ్ బిజినెస్ స్థాయిని తాకగలిగితేనే… ఆ ‘ప్రీ రిలీజ్’ అన్న మాటకు సార్ధకత ఉంటుంది. లేని పక్షంలో ఆ హీరోకు ఉన్న క్రేజ్ లో అర్ధం ఉండదు, అలాగే ఆ హీరోకు అంత మార్కెట్ లేదన్న విషయం బహిరంగమవుతుంది. అయితే అసలు జరుగుతున్న విషయం ఏమిటంటే… ఒక సినిమా సూపర్ హిట్ అయితే వచ్చే కలెక్షన్స్ తో సమానంగా ప్రీ రిలీజ్ బిజినెస్ ఉండడం. హీరోలపై ఉన్న క్రేజ్, కాంభినేషన్, ముందు చిత్రాల మార్కెట్ ను తదితర అంశాలను అంచనాలు వేసుకుని… వాస్తవంగా ఆ హీరోకు ఉన్న మార్కెట్ కంటే కూడా రెండింతలు పెట్టి మరీ డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేస్తుండడంతో… రికార్దు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది.

ఇలా అంచనాలు వేసే ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ విషయంలో తలలు పట్టుకున్న తిన్న డిస్ట్రిబ్యూటర్లు, తాజాగా విడుదల కాబోతున్న మరో పెద్ద సినిమా ‘బ్రహ్మోత్సవం’కు కూడా అదే బాటను అనుసరిస్తున్నారు. ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు దాదాపుగా 100 కోట్ల మేరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని టాలీవుడ్ లో ‘బ్రహ్మోత్సవం’పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఆడియో, శాటిలైట్స్ హక్కులు కలుపుకుని, బహుశా ఇంత మొత్తం అయితే అయి ఉండవచ్చు గానీ, నిజంగా ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు 100 కోట్లు రెవెన్యూ వసూలు చేసే సీన్ ఉందా అంటే… అది ప్రశ్నార్ధకమే.

సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్ప ఈ రేంజ్ లో వసూళ్లు రావన్న విషయం ట్రేడ్ పండితులకు తెలియనిది కాదు. ఒకవేళ టాక్ కాస్త అటు, ఇటు అయితే 40 నుండి 50 కోట్లకే పరిమితం అవుతుంది. అంటే దాదాపుగా అంచనా వేసిన దాంట్లో 50 శాతంపైగా నష్టం. మళ్ళీ గగ్గోలు పెట్టేది డిస్ట్రిబ్యూటర్లే. ఇది ఒక్క ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు మాత్రమే పరిమితం కాదు. అంచనాలను మించి పెట్టుబడులు పెడుతున్న ఏ సినిమాకైనా ఇదే గతి. ‘శ్రీమంతుడు’ సినిమా కలెక్షన్స్ ను చూసి ‘బ్రహ్మోత్సవం’ కూడా అదే స్థాయిలో వసూలు చేస్తుందని ఆశిస్తున్న ఈ పెట్టుబడిదారులు చేతులు కాల్చుకోకూడదని మాత్రం ఆశిద్దాం.