Brahmins controversy on NTR Bigg Boss బాలీవుడ్ లో అడల్ట్ ప్రకంపనలు రేపిన ‘బిగ్ బాస్’ షోపై ఇటీవల తమిళులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కమల్ హాసన్ పై మండిపడిన తమిళులు మండిపడగా, తాజాగా తెలుగు ‘బిగ్ బాస్’పై కూడా వివాదం రాజుకుంది. అల్లు అర్జున్ “దువ్వాడ జగన్నాధమ్” సినిమాలోని పాట పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేసిన బ్రాహ్మణా సంఘాలు, తాజాగా ఈ ‘బిగ్ బాస్’ షోపై కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ షోలో హైందవ సంస్కృతిని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని బ్రాహ్మణ సంఘాలు ఆరోపిస్తున్నాయి. హోమగుండం వద్ద బ్రష్‌ చేసుకుంటూ చలి మంటలు కాచుకుంటున్నట్లుగా దృశ్యాలు ఉన్నాయని, అందులో ఆజ్యం పోస్తుండటం వంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని, వాటిని సవరించి, క్షమాపణ చెప్పాలని జోగుళాంబ గద్వాల జిల్లా బ్రాహ్మణ సేవాసమితి డిమాండ్‌ చేసింది.

ఒకవేళ క్షమాపణలు చెప్పని పక్షంలో ఆందోళన చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేసారు. ‘బిగ్ బాస్’ ఇచ్చిన టాస్క్ లో భాగంగా రెండు రోజుల పాటు హోమగుండాన్ని నిరంతరాయంగా వెలిగించిన విషయం తెలిసిందే. అయితే రెండు రోజుల తర్వాత ఈ హోమగుండం ఆగిపోగా, ప్రస్తుతం మరో టాస్క్ ‘బిగ్ బాస్’ షోలో రన్ అవుతోంది. తొలి రోజుల్లోనే వివాదం రాజుకోగా, మున్ముందు ఇంకెన్ని చుట్టుముడతాయో చూడాలి.