Brahmastra-Movieకోవిడ్ ప్ర‌భావంతో ఇబ్బందుల‌ను ఎదుర్కొన్న ఇండ‌స్ట్రీల్లో చిత్ర ప‌రిశ్ర‌మ ఒక‌టి. కోవిడ్ ఎఫెక్ట్ త‌ర్వాత ఆడియెన్స్ థియేటర్స్‌కు రావ‌టం చాలా వ‌ర‌కు త‌గ్గింది. దీనికి మ‌రో కార‌ణం. కోవిడ్ స‌మ‌యంలో ప్రేక్ష‌కులు ఓటీటీ కంటెంట్‌కు అల‌వాటు ప‌డ‌ట‌మే. దీంతో సినిమాను ప్రేక్ష‌కులు చూసే యాంగిల్ మారిపోయింది. రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలను జ‌నాలు ఆద‌రించ‌టం లేదు. బాలీవుడ్ ప‌రిస్థితి అయితే మ‌రీ ఘోరంగా త‌యారైంది. వంద కోట్లు, రెండు వంద‌ల కోట్లు అంటూ జ‌బ్బ‌లు చ‌రిచిన స్టార్ హీరోల సినిమాలు బోల్తా ప‌డ్డాయి. కానీ ద‌క్షిణాది సినిమాలు మాత్రం భారీ విజ‌యాల‌ను ద‌క్కించుకున్నాయి. ముఖ్యంగా పుష్ప‌, RRR, KGF 2 వంటి సినిమాలైతే పాన్ ఇండియా మూవీస్‌గా రిలీజై, రికార్డ్ కలెక్ష‌న్స్ ద‌క్కించుకున్నాయి.

‘బ్రహ్మాస్త్ర’తో బాలీవుడ్‌కి ఊరట :

ఒక వైపు సౌత్ సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌త్తా చాటుతుంటే.. హిందీ చిత్రాలు డిజాస్ట‌ర్స్ అయ్యాయి. ఇది అక్క‌డి స్టార్స్‌కు మింగుడు ప‌డ‌లేదు. మంచి బ్రేక్ దొరక్క‌పోతుందా! అని బాలీవుడ్ ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, హీరోలు ఎదురు చూడ‌సాగారు. వారు ఊహించినట్లే రీసెంట్‌గా విడుద‌లైన బ్ర‌హ్మాస్త్ర‌తో బ్రేక్ దొరికింది.

బ్ర‌హ్మాస్త్ర సినిమాను రూ.400 కోట్ల‌కు పైగానే ఖ‌ర్చు పెట్టి తెర‌కెక్కించారు. ర‌ణ‌భీర్‌, ఆలియా వంటి స్టార్స్‌తో పాటు అమితాబ్‌, నాగార్జున‌, షారూక్ ఖాన్ వంటి వారు న‌టించ‌టంతో సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీనికి తోడు బాలీవుడ్ సినిమా అని కాకుండా పాన్ ఇండియా సినిమా అని ప్ర‌మోట్ చేసింది చిత్ర యూనిట్‌. ముఖ్యంగా ర‌ణ్‌భీర్, ఆలియా అయితే సౌత్ ప్రేక్ష‌కుల‌ను ఆయా ద‌క్షిణాది భాష‌ల్లో మాట్లాడి ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. మ‌రో వైపు అగ్ర ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఈ సినిమాను ద‌క్షిణాది రాష్ట్రాల్లో భుజాల‌కెత్తుకోవ‌టం కూడా క‌లిసి వ‌చ్చింది.

తెలుగు రాష్ట్రాల్లోనే బ్ర‌హ్మాస్త్ర సినిమా తొలి రోజున రూ.6.7 కోట్ల‌ను వ‌సూలు చేసింది. ఇది అనువాద హిందీ సినిమా క‌లెక్ష‌న్స్‌లో ఓ రికార్డ్‌గా నిలిచింది. ఓవ‌ర్ సీస్‌లో ప్రీమియ‌ర్స్‌, తొలిరోజున క‌లిపి బ్ర‌హ్మాస్త్ర‌కు దాదాపు రెండు మిలియ‌న్ డాల‌ర్స్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఇది చాలా పెద్ద నెంబ‌ర్ అని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. వ‌ర‌ల్డ్ వైడ్‌గా అన్నీ భాష‌ల్లో క‌లిపి సినిమాకు రూ.75 కోట్లు వ‌చ్చాయి. ఇదే స్పీడు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రెండో రోజు కూడా కొన‌సాగింద‌ని సినీ స‌ర్కిల్స్ టాక్‌.

నెగిటివ్ నుంచి పాజిటివ్‌.. క‌లిసి వ‌చ్చిన స్టార్స్ మంత్రం :

బ్ర‌హ్మాస్త్ర క‌లెక్ష‌న్స్ విష‌యంలో ద‌ర్శ‌క నిర్మాత‌లు చాలా సంతోషంగా ఉన్నారు. సినిమాకు తొలి రోజున మిక్స్‌డ్ టాక్ వ‌చ్చింది. ఇది ప్రొడ్యూస‌ర్స్‌లో తెలియ‌ని టెన్ష‌న్‌ను క్రియేట్ చేసింది. భారీ బడ్జెట్ మూవీ క‌దా, ఏం చేయాలా అని త‌ల‌లు ప‌ట్టుకున్నారు. కానీ స‌గ‌టు ప్రేక్ష‌కులు ఆలోచ‌నా శైళి మారింది.సినిమాకు ప‌ర్లేదు అని టాక్ వ‌స్తే చాలు.. మంచి నిర్మాణ విలువ‌లు, స్టార్స్ ఉంటే సినిమాను చూడాల‌నుకుంటున్నారు. ఈ సినిమా రిలీజ్‌కు ముందు ‘బాయ్ కాట్ బ్ర‌హ్మాస్త్ర’ అని నెగ‌టివ్ ప‌బ్లిసిటీ కూడా సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. కానీ ప్రేక్ష‌కులు దాన్ని ఏం ప‌ట్టించుకోలేదు. బాయ్‌కాట్‌నే బాయ్‌కాట్ చేసేస్తూ సినిమాను చూసేస్తున్నారు. నాన్ హాలీడే రోజునే ఈ మేర‌కు వ‌సూళ్లు వ‌స్తే ఇక వీకెండ్‌లో ఇంకా బాగుంటాయ‌ని భావించారు. అనుకున్న‌ట్లే బ్ర‌హ్మాస్త్ర‌కు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్స్ జోరు చూపిస్తుంది. మ‌రి ఇదే జోరుని ఇత‌ర పాన్ ఇండియా సినిమాలు క్యారీ చేస్తాయో లేవో చూడాలి.

పొన్నియిన్ సెల్వ‌న్‌పైనే క‌న్ను :

ఇప్పుడు అంద‌రి క‌న్ను కోలీవుడ్ నుంచి రాబోతున్న పొన్నియిన్ సెల్వ‌న్‌పై ఉంది. మ‌ణిర‌త్నం వంటి ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన సినిమా ఇది. విక్ర‌మ్‌, ఐశ్వ‌ర్యా రాయ్‌, త్రిష‌, కార్తి, జ‌యం ర‌వి, జ‌య‌రాం వంటి స్టార్స్ న‌టించ‌టంతో సినిమాపై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. రెండు భాగాలుగా రూపొందుతోన్న పొన్నియిన్ సెల్వ‌న్‌లో తొలి భాగం సెప్టెంబ‌ర్ 30న రిలీజ్ కానుంది.