Brahmanandam, Brahmanandam Retirement, Comedian Brahmanandam Retirement, Brahmanandam Retirement Announced, Brahmanandam Retirement Confirmed, Comedy Actor Brahmanandam Retirement‘నవ్వుల బ్రహ్మ’ బ్రహ్మానందం గురించి నేడు ప్రత్యేకంగా చెప్పేదేముంది? ఒక కమెడియన్ అని చెప్పడం కంటే స్టార్ హీరో, స్టార్ దర్శకుడు రేంజ్ బ్రహ్మిది అని చెప్పడం సరిగ్గా ఉంటుందేమో! ఒకానొక స్థాయిలో బ్రహ్మి వలనే స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు వసూలు చేసాయని చెప్పడంలో సందేహం లేదు. అయితే అంతటి స్థాయిని చవిచూసిన బ్రహ్మి ఒరవడి ఇటీవల కాలంలో పూర్తిగా తగ్గిపోయిందన్నది అందరూ అంగీకరించే సత్యం.

ఒకే తరహా పాత్రలు పోషించడంతో కొత్తదనం లేక బ్రహ్మి స్థాయి తగ్గింది. దీనికి తోడు ఫ్రెష్ నెస్ తో కూడిన సప్తగిరి వంటి యువతరం కమెడియన్లు రావడం, అలాగే వర్ధమాన నటులుగా పోసాని, ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ పృధ్వీ వంటి వారు కమెడియన్ల అవతారం దాల్చడంతో ప్రేక్షకులు సహజంగానే వారికి పట్టం కడుతున్నారు. ఆయా నటులు పోషించిన పాత్రల కోసం రిపీట్ ఆడియన్స్ వచ్చిన సందర్భాలు ఉంటున్నాయి. దీంతో టాలీవుడ్ లో బ్రహ్మి ప్రస్థానం ముగిసిపోయిందా? అన్న టాక్ కూడా ఓ వైపు హల్చల్ చేస్తూనే ఉంది.

అయితే ‘ఆటాడుకుందాం రా’ ఆడియో వేడుకపై బ్రహ్మి ఇలాంటి సంకేతాలనే ప్రేక్షకులకు అందించారా? అన్న చర్చ ట్రేడ్ వర్గాల్లో ప్రారంభమైంది. ‘ఆటాడుకుందాం రా’ సినిమా పూర్తిగా మిమ్మల్ని నవ్విస్తుందని, ఇలాంటి కొత్తతరం దర్శకులు, రచయితలు, నటులు ముందుకు రావాలని, పాత తరం వారు కాస్త పక్కకు జరగాలని తానూ మనస్పూర్తిగా కోరుకుంటున్నానని, నేను కూడా కొంచెం పక్కకు జరుగుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను… అంటూ బ్రహ్మి చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ నాట చర్చనీయాంశంగా మారాయి.

సినిమాల నుండి ఇక దూరం జరగబోతున్నానని బ్రహ్మి పరోక్షంగా చెప్పారా? లేక వేరే ఎవరినైనా ఉద్దేశించి బ్రహ్మి ఈ వ్యాఖ్యలు చేసారా? అన్నది ఆసక్తికరంగా మారింది. కొత్త నీరు చేరిక అన్నది నిరంతరం జరిగే ప్రక్రియే. అయితే దాన్ని నొక్కివొక్కానిస్తూ చెప్పడమనేది దేనికి సంకేతాలు? అంటూ సినీ అభిమానులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే బ్రహ్మి ఇక సినిమాల నుండి రిటైర్ కానున్నారా? ప్రేక్షకులు తిప్పికొట్టే దాని కంటే ముందే, గౌరవంగా కొత్త వారికి అవకాశం కల్పించాలనే సముచితమైన నిర్ణయం తీసుకోనున్నారా?

అయితే బ్రహ్మానందంకు ఇలాంటి అనుభవాలు గతంలో చవిచూసినవే. ప్రేక్షకులకు బోర్ కొట్టిన ప్రతిసారి కొత్తదనంతో మళ్ళీ టాలీవుడ్ ని ఏలడం బ్రహ్మికి పరిపాటే. మరి ఈ సారి కూడా అలా ‘బౌన్స్ బ్యాక్’ అవుతారా? లేక పెరిగిన వయసు రీత్యా ‘గుడ్ బై’ చెప్తారా? ఏది ఏమైనా… బ్రహ్మి వెండితెరకు దూరమైతే, సినీ అభిమానులకు అత్యంత చేదుకరమైన వార్తగా భావించాలి.