Boyapati Srinu logic‘సర్ధార్ గబ్బర్ సింగ్’ భారీ ఫ్లాప్ తర్వాత మెగా అభిమానులను ఉత్సాహపరిచేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన “సరైనోడు” సినిమా ప్రస్తుతం ధియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమా ఫలితం పూర్తి స్థాయిలో తెలియాలంటే ఈ వీకెండ్ పూర్తి కావాలి. తొలి రోజు ఓపెనింగ్స్ భారీ స్థాయిలో ఉన్నా… సినిమాను చూసిన ప్రేక్షకుడికి లాజిక్ లేని బోయపాటి లవ్లీ సన్నివేశాలు ఏమిటో అర్ధం కావడం ఆగమ్యగోచరంగా మారింది.

సినిమాలో ఫస్టాఫ్ అంతా హీరో అల్లు అర్జున్ ఎమ్మెల్యే కేథరీన్ థెరీసా వెంట పడుతూ ఉంటారు. బోయపాటి మొదటి సినిమా నుండి ఫాలో అవుతూ వస్తున్న తీరు మాదిరే… హీరో ఫస్ట్ లుక్ లోనే ప్రేమలో పడిపోవడం… ‘గ్లామరస్’ ఎమ్మెల్యే (నిజంగా మహిళా ఎమ్మెల్యే ఇలా ఉంటే స్కూలు పిల్లలు బడికి వెళ్లినట్టు… ఎవ్వరూ అసెంబ్లీని మిస్ అవ్వరు మరి…) వెంట పడడం… ఆ తర్వాత పెళ్లి చేసుకునే వరకు వెళ్ళడంతో వచ్చిన తరుణంలో రకుల్ ప్రీత్ ఇంటర్వెల్ బ్యాంగ్ వేయడం జరిగిపోతుంది.

కేథరీన్ థెరీసాతో పెళ్లి వరకు వెళ్ళిన హీరో గారు సెకండాఫ్ లో మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ కు కనెక్ట్ అవుతారు. మరి ఫస్టాఫ్ లో చూపించిన ఎమోషన్ ఎక్కడి వెళ్ళింది అని ప్రేక్షకుడు ఆలోచిస్తే… ఆ లాజిక్ కు లెక్కుండదు మరి. ఇలాంటి ‘లాజిక్ లెస్’ సన్నివేశాలకు ‘సరైనోడు’ కేరాఫ్ అడ్రస్ గా తీర్చిదిద్దాడు దర్శకుడు బోయపాటి. మరొక విచిత్రమైన విషయం ఏమిటంటే… రకుల్ ప్రీత్ తండ్రి సాయికుమార్ తో హీరో తండ్రికి ఉన్న అత్యంత సాన్నిహిత్యం రీత్యా తన కొడుకును రకుల్ వద్దకు ‘పెళ్లి చూపులు’ చూడాలని కోరడం… హీరో గారు చూడకుండానే… ఆమె ఒప్పుకోలేదని చెప్పడం వరకు బాగానే ఉన్నా… అంత క్లోజ్ ఫ్రెండ్స్ అయిన హీరో హీరోయిన్ల తండ్రులు ఒక్కసారి కూడా తమ వారసుల గురించి మాట్లాడుకోకపోవడం విస్తుపోయే అంశం.

ఇలాంటి సన్నివేశాలతో ‘సరైనోడు’ సినిమా నింపేసారు దర్శకుడు బోయపాటి. మరీ ముఖ్యంగా ప్రేమ సన్నివేశాలను సరిగా హ్యాండిల్ చేయలేకపోయారన్న విమర్శలు మూటకట్టుకుంటున్నారు. యాక్షన్ సన్నివేశాల రూపకల్పన బోయపాటికి ఉన్న ప్రావీణ్యత లవ్ సన్నివేశాలను చిత్రీకరించే సందర్భంలో కనపడకపోవడం ‘సరైనోడు’లో స్పష్టంగా కనపడుతోంది. మరి లాజిక్ లేని సన్నివేశాలతో ప్రేక్షకులను మ్యాజిక్ చేయాలంటే కాస్త కష్టమైన విషయమని బోయపాటి గారు ఆలోచించలేదా..!