Director Boyapati Shooting Vijayawada Krishna Pushkaraluకృష్ణా పుష్కరాల సందర్భంగా నదీమ్మ తల్లికి హారతి ఇచ్చే ఏర్పాట్లు ఎలా ఉండాలన్న విషయమై దర్శకుడు బోయపాటి శ్రీను మంత్రులతో కలసి సమీక్షించారు. ఫెర్రీ పుష్కర ఘాట్ ను సందర్శించిన బోయపాటి, హారతి విధానంపై పలు సూచనలు చేశారు. యాత్రికులకు అందరికీ దర్శనమిచ్చేలా హారతి ఎలా ఉండాలి? ఎంత ఎత్తులో వేదిక ఉండాలి? అన్న తదితర విషయాలపై విశ్లేషించి, తన ఆలోచనలను మంత్రులు నారాయణ, దేవినేని ఉమలకు వివరించారు.

విజయవాడ దుర్గా ఘాట్ వద్ద మరియు గోదావరి – కృష్ణమ్మలు సంగమించే ఫెర్రీ ఘాట్ వద్ద ‘పుష్కర హారతి’ కార్యక్రమం బోయపాటి మార్గనిర్దేశంలో జరుగుతుందన్న సంగతి తెలిసిందే. ఇక ఘాట్ల నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయని చెప్పిన దేవినేని ఉమ, భక్తులు సులువుగా ఘాట్లకు వెళ్లేలా చూస్తామని, ఇబ్బందులు పడనీయకుండా చూడటమే తమ ఉద్దేశమని వెల్లడించారు. ఎలాంటి దుర్ఘటనలూ జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని అన్నారు.

గతేడాది గోదావరి పుష్కరాల తొలి రోజున జరిగిన దుర్ఘటన నేపధ్యంలో ప్రతి చిన్న అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మరీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ఎలాంటి అవాంచనీయ దాడులు జరగకుండా విజయవాడ నగర వ్యాప్తంగా, ప్రతి 20 అడుగులకు ఒక సీసీ కెమెరాను అమర్చారు. ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, ప్రజలు సంయమనం పాటిస్తూ పుష్కర స్నానాలు చేసేలా తీర్చిదిద్దాలని బోయపాటి సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది.