Botsa-Satyanarayanaరాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అపార రాజకీయ అనుభవజ్ఞుడే కానీ అప్పుడప్పుడు ఆయన మాట్లాడే మాటలతో విమర్శలకు గురవుతుంటారు. నిన్న ఆయన విజయనగరంలో జిల్లా వైసీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. చాలా రోజుల తరువాత జరుగుతున్న ఈ సమావేశానికి కూడా చాలా మంది ముఖ్యనేతలు రాలేదు. పైగా పార్టీ పదవులు పొందిన కొందరు మహిళలకు బదులు వారి భర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఇది చూసి మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “నేను నిర్వహించే పార్టీ సమావేశానికి వచ్చేందుకు కూడా పార్టీలో ఎవరికీ తీరిక లేదా? పార్టీ సమావేశానికి హాజరు కాలేనప్పుడు, పార్టీ కోసం పనిచేసే తీరిక లేనప్పుడు పదవుల కోసం పోటీ పడటం దేనికి?అయినా మీ భార్యలకు బదులు మీరు రావడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా?మళ్ళీ మరోసారి ఇలా జరిగితే ఉపేక్షించేది లేదు” అంటూ అందరికీ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

అయితే అసలు కధ ఆ తరువాతే మొదలైంది. “మనమంతా మరో రెండేళ్ళు కష్టపడితే రాబోయే 5 ఏళ్ళు మళ్ళీ మనమే అధికారంలో ఉంటాము. మాకు (మంత్రులకు) అమరావతిలో ఒకే సచివాలయం ఉంటే, జిల్లాలో ఉండే అన్ని సచివాలయాలు ఎమ్మెల్యేలవే,” అని అన్నారు.

ప్రజలకు, ప్రభుత్వ కార్యాలయాలకు మద్య సచివాలయాలు వంతెన వంటివని, వాటితో ప్రజల ముంగిటకే పాలన వస్తుందని సిఎం జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకొన్నప్పటికీ, వాటికి వైసీపీ రంగులు వేయడంతో అవి ఆ పార్టీ కార్యాలయాలనే భావన ప్రజలలో ఏర్పడింది. ఇప్పుడు మంత్రి బొత్స సత్యనారాయణ మాటలు వింటే అదే అనిపిస్తుంది.

ఇప్పటివరకు నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాలకు మాత్రమే పార్టీ పదవులున్నాయి. ఇకపై సచివాలయాలను కూడా ఇన్ని సచివాలయాలు ఈ ఎమ్మెల్యేకి… ఇన్ని సచివాలయాలు ఈ ఎమ్మెల్సీకి, నేతలకి…అని వాటినీ కేటాయించుకొంటారేమో?అయినా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సచివాలయాలను పంచుకోవడానికి ఆవేమైనా వారి సొంత ఆస్తులా?