Botsa- Satyanarayanaఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం ఉండవల్లిలో కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రజా వేదిక భవనాన్ని కూల్చివేత, పేద ప్రజలకు రూ.5లకే కడుపు నిండా అన్నం పెట్టే అన్నా క్యాంటిన్లను మూసివేయడంతో మొదలైన వివాదాలు నేటికీ నిరంతరంగా సమస్యలు లేదా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

సచివాలయాలకు, గాంధీ విగ్రహాలు, విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ దిమ్మలకు వైసీపీ రంగులు వేయడాలు, రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌ తొలగించి ఆయన స్థానంలో హడావుడిగా మరొకరిని నియమించడం, ఐపీఎస్ అధికారి బి.వెంకటేశ్వరరావుని రెండేళ్ళుగా నిరవధికంగా సస్పెండ్‌ చేస్తుండటం, 8మంది ఐఏఎస్ అధికారులు హైకోర్టుకి క్షమాపణలు చెప్పుకొని జైలు శిక్ష నుంచి బయటపడటం, మూడు రాజధానులు, వేతన సవరణను నిరసిస్తూ లక్షలాది మంది ఉద్యోగులు ‘ఛలో విజయవాడ’ అంటూ అన్ని అవరోధాలు దాటుకొని విజయవాడ చేరుకోవడంతో డిజిపిపై వేటువేయడం ఇలా నేటికీ ఈ జాబితాకు అంతే కనబడటం లేదు. వీటన్నిటిపై హైకోర్టు నిత్యం మొట్టికాయలు వేస్తూ బ్రేకులు వేస్తుండటం మరో విశేషం. మరో విదంగా చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వం ఒక వివాదం నుంచి మరో వివాదంలోకి ప్రయాణిస్తోందని చెప్పవచ్చు.

తాజాగా సీపీఎస్‌ను రద్దు చేయాలంటూ యుటిఎఫ్ నేతృత్వంలో నేడు ఉపాధ్యాయులు సిఎంవో ముట్టడికి ప్రయత్నించడంతో మరో వివాదం మొదలైంది. వారి చర్యను విద్యాశాఖ మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ ఖండిస్తూ, “దీనిపై ప్రభుత్వం కమిటీ వేసి అధ్యయనం చేయిస్తున్నప్పుడు ఉపాధ్యాయులు ఈవిదంగా సిఎంవో ముట్టడికి ప్రయత్నించడం సరికాదు. సిఎం జగన్మోహన్ రెడ్డి ఉపాధ్యాయుల సమస్యలను మానవతాదృక్పదంతో చూసిపరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంటే, ఉపాధ్యాయులు ఆయన కార్యాలయాన్నే ముట్టడికి ప్రయత్నించడాన్ని వారు ఏవిదంగా సమర్ధించుకొంటారు? ఇది సమస్యను మరింత జటిలం చేస్తుందే తప్ప పరిష్కరించదు,” అని అన్నారు.

అయితే సిఎం జగన్మోహన్ రెడ్డి గతంలో ఈ అంశంపై ఉపాద్యాయుల డిమాండ్లను సమర్ధించగా ఇప్పుడు పోలీసుల చేత అణచివేయిస్తుండటం చాలా ఆశ్చర్యకరం. అయిష్టంగానే విద్యాశాఖ మంత్రి పదవి చేపట్టిన మంత్రి బొత్స సత్యనారాయణకి ఉపాధ్యాయులు కూడా ఈవిదంగా తొలి పరీక్ష పెట్టారు. మరి విద్యాశాఖలో మంత్రి బొత్స సత్యనారాయణ ఎంతవరకు ఉత్తీర్ణులవుతారో చూడాలి.