Botsa Satyanarayana said Wanting 175 seats is not greedyబుదవారం తాడేపల్లి సిఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో సిఎం జగన్మోహన్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారిలో కొందరు తమ కుమారుల చేత గడప గడపకి కార్యక్రమం ‘మమ’ అనిపించేస్తుండటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే, ఒకరిద్దరు నేతలు వచ్చే ఎన్నికలలో మేము పోటీ చేయబోమని తమ వారసులే పోటీ చేస్తారని చెప్పడంతో సిఎం జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని హితవు పలికారు. 175 సీట్లు సాధించడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని గట్టిగా నొక్కి చెప్పారు.

ఈ సమావేశం గురించి మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, “ప్రతీ రంగంలోను వారసులున్నట్లే రాజకీయాలలో కూడా ఉంటారు. నావరకైతే నా వారసుడు వైద్య రంగంలోకి వెళ్ళాడు కనుక ఈ సమస్య నాకు వర్తించదు. వారసులు రాజకీయాలలోకి రావాలనుకోవడం తప్పు కాదు కానీ వారిని ప్రజలు ఆదరించి, ఆశీర్వదిస్తేనే రాజకీయ నాయకులుగా రాణించగలుగుతారు. కనుక మా అధినేత జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీ చేసి మళ్ళీ తమ స్థానాలను గెలుచుకోవాలని నొక్కి చెప్పారు. 175 సీట్లు గెలవాలనుకోవడం అత్యాశ కాదు. ఒక్క సీటు పోతే పోనీ అనుకొంటూ వదిలేస్తే దాని వెనుక మరో 10 సీట్లు పోయే ప్రమాదం ఉంటుంది. కనుక 175 టార్గెట్ పెట్టుకొని పనిచేయడం చాలా మంచి ఆలోచనే,” అని అన్నారు.

25 ఏళ్ళ రాజకీయ అనుభవం కలిగి, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మంత్రి పదవిని చేజిక్కించుకొనే అమోఘమైన తెలివితేటలున్న మంత్రి బొత్స సత్యనారాయణ, మొత్తం 175 సీట్లు తమ పార్టీకే రావాలనుకోవడం అత్యాశ కాదని చెపుతుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది.

గత ఎన్నికలలో వైసీపీ ప్రభంజనంలో, అంతకు ముందు టిడిపి ప్రభంజనంలో కూడా వైసీపీ, టిడిపిలకు 175 సీట్లు ఎందుకు రాలేదో ఆయనకీ తెలుసు. దేశంలో అత్యంత పాపులర్ ముఖ్యమంత్రులలో ఒకరైన తెలంగాణ సిఎం కేసీఆర్‌కు ఆ రాష్ట్రంలో అత్యంత ప్రజాధారణ ఉంది. పైగా తెలంగాణ రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేసి చూపుతున్నారు. అయినా కూడా ఆయన పార్టీకి ప్రతీ ఎన్నికలలో కొన్ని సీట్లు తగ్గుతున్నాయే తప్ప పెరగడం లేదు. అటువంటి ముఖ్యమంత్రికి, పార్టీకే అన్ని సీట్లు సాధించడం అసాధ్యమవుతున్నప్పుడు, రాష్ట్రానికి ఏమీ చేయకుండా, అప్పుల పాలు చేసి 175 సీట్లు వస్తాయని చెపుతుంటే బొత్స సత్యనారాయణ తందానతాన పాడుతుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది.