Botsa Satyanarayanaసోషల్ మీడియాలో వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు, ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ చేస్తున్న ఆగడాలు అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిన్న ఒక తెర మీద ప్రొజెక్టు చేసి మరి మీడియాకు చూపించారు. అలాగే సోషల్ మీడియాలో చిన్న చిన్న వాటికి కూడా టీడీపీ వారి మీద కేసులు పెట్టి వేధిస్తున్న వైనాన్ని బాధితులతోనే వివరింపచేశారు.

దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. చంద్రబాబుపై సోషల్ మీడియాలో వచ్చిన పోస్టింగ్స్‌ని ఆయన ఖండించారు. సోషల్ మీడియా పోస్ట్‌లపై పోలీసులు ఏం చేయాలో వారి పని వారు చేస్తున్నారన్నారు. అయితే అక్కడితో ఆపేస్తే బానే ఉండేది కానీ పెయిడ్ ఆర్టిస్టుని పెట్టించి తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులే వస్తాయని చెప్పుకొచ్చారు.

సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్‌లను తాము ప్రోత్సహించడంలేదన్నారు. చంద్రబాబు నేర్పిన విద్యే ఆయనకు తిప్పలు తెస్తున్నాయని చెప్పారు. చంద్రబాబు ఆలోచన ధోరణి మారాలని సూచించారు. మంత్రి వ్యాఖ్యలు అటువంటి దూషణలకు పాల్పడే వారిని సమర్దించినట్టు కనిపిస్తుంది. అది ఎంత మాత్రం మంచి ధోరణి కాదు.

మరోవైపు చంద్రబాబుని, లోకేష్ ని, ఇతర టీడీపీ నాయకులను వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు తిట్టిన బూతులను టీవీలో చూపించడం వినిపించడం మాజీ ముఖ్యమంత్రి స్థాయి కాదని వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ ద్వారా కొత్త కోణం చూపించడం విశేషం. సభ్యసమాజం సిగ్గు పడే మాటలు అనడం ఎందుకు వాటికి బయటకు చూపిస్తే ఇబ్బంది పడటం ఎందుకు అని టీడీపీ వారు ఎద్దేవా చేస్తున్నారు.