Botsa Satyanarayana responds on harish rao comments on ap govtజగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులపై కేసులు పెట్టి వేదిస్తూ లోపల వేస్తోందంటూ తెలంగాణ ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ వెంటనే స్పందిస్తూ, “ఆయన ఆవిదంగా ఎందుకు అన్నారో నాకు తెలీదు కానీ ఆయన మా ప్రభుత్వం గురించి ఆ మాట అని ఉంటారని నేను అనుకోవడం లేదు. ఒకవేళ మా ప్రభుత్వం గురించే అని ఉంటే ఆయన ఒకసారి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించి వచ్చి చూస్తే మేము ఉపాధ్యాయులను ఎంత బాగా చూసుకొంటున్నామో, వారి కోసం మా ప్రభుత్వం ఏమేమి చేస్తోందో తెలుస్తుంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం ఎంత పీఆర్సీ ఇచ్చింది… ఇక్కడ మా ప్రభుత్వం ఎంత ఇచ్చిందో కూడా ఆయనకి చూపిస్తాము. మా ప్రభుత్వం పట్ల రాష్ట్రంలో ఉపాధ్యాయులు చాలా సంతోషంగా ఉన్నారు,” అని అన్నారు.

రాజధాని రైతు సంఘం నాయకుడు నిన్న ఏలూరులో తనపై చేసిన ఆరోపణలపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. “రైతు సంఘం నాయకుడని చెప్పుకొంటున్న ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి. అమరావతిలో తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే పాదయాత్రలో పాల్గొంటున్నాడు. నేనేదో ఊరిని దోచేసుకొంటున్నాననట్లు ఆయన మాట్లాడటం సరికాదు. నాకు మా తాతలు సంపాదించిన ఆస్తులే చాలా ఉన్నాయి. నేను ఇంటర్ చదివే రోజులలోనే అంబాసిడర్ కారులో కాలేజీకి వెళ్ళేవాడిని. కనుక నాకు ఏనాడూ ఆస్తుల మీద వ్యామోహం లేదు,” అని అన్నారు.

రైతుల మహాపాదయాత్రపై స్పందిస్తూ, “వారి వెనుక తెలుగుదేశం పార్టీ ఉందని అందరికీ తెలుసు. రైతుల ముసుగులో టిడిపికి చెందినవారే పాదయాత్ర చేస్తున్నారు. దాని బదులు టిడిపి నేతలే పార్టీ కండువాలు కప్పుకొని నేరుగా పాదయాత్ర చేయొచ్చు కదా?” అని ప్రశ్నించారు.

విశాఖ సముద్రతీరాన్న పచ్చటి రుషికొండను తవ్వేస్తున్నారంటూ తమ పార్టీకే చెందిన ఎంపీ రఘురామ కృష్ణరాజు, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై కూడా మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ, “అక్కడ జరగరానిది ఏదో జరిగిపోతోందన్నట్లు మాట్లాడటం సరికాదు. ఎవరికైనా అనుమానాలు ఉంటే మేమే స్వయంగా అఖిలపక్షాన్ని అక్కడికి తీసుకువెళ్లి చూపించి అక్కడ జరుగుతున్న పనుల గురించి వివరించడానికి సిద్దంగా ఉన్నాము. అక్కడ పాత హోటల్‌లో స్థానంలో అత్యాధునిక సదుపాయాలున్నా కొత్త హోటల్, ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తే తప్పేమిటి? అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఉపాధ్యాయులు సంతోషంగా ఉంటే వారు ‘ఛలో విజయవాడ’ అనేవారే కారు కదా?ఒత్తిళ్ళు భరించలేకనే చివరి నిమిషంలో తమ కార్యక్రమం రద్దు చేసుకొన్నామని వారే స్వయంగా చెప్పారు కదా? ఇక రాజధాని రైతుల పాదయాత్ర ఏ ఊరు, ఏ జిల్లాలో ప్రవేశిస్తే అక్కడి టిడిపి నేతలు పాల్గొంటూ వారికి సంఘీభావం తెలుపుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక టిడిపి నేతలకు రైతుల ముసుగు వేసుకోవలసిన అవసరం లేదని స్పష్టం అవుతోంది.

రుషికొండలో రాజధానికి సంబందించి ఎటువంటి కట్టడాలు కట్టరాదని హైకోర్టు ఆదేశించింది. కానీ మంత్రి బొత్స సత్యనారాయణ అక్కడ ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయాలు కడుతున్నట్లు చెపుతున్నారు. అదే నిజమైతే కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు రేపు ప్రభుత్వమే హైకోర్టుకి సంజాయిషీ ఇచ్చుకోవలసి వస్తుంది.