Botsa Satyanarayana responds on Anna Canteens shut downజగన్ ప్రభుత్వం అన్నా కాంటీన్లు ఎత్తివేస్తుంది అనే వార్తలు రావడంతో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగడంతో ప్రభుత్వం ఆ ఆలోచన విమరించుకున్నట్టుగా కనిపిస్తుంది. ఈరోజు అసెంబ్లీలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ… పేదవాడి కడుపుకొట్టే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని, అన్నా క్యాంటీన్లను మూసివేయలేదని తెలిపారు. ఎన్నికల ప్రచారం కోసం హడావుడిగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారని, మార్చురీ పక్కన కూడా పెట్టారన్నారు.

ఇటువంటి పరిస్థితుల్లో వాటిపై పూర్తి ప్రక్షాళన జరిపి ప్రజలకు మేలు చేకూర్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు బోత్స తెలిపారు. రాష్ట్రంలో 183 అన్నా క్యాంటీన్లు ఉన్నాయన్నారు. అంతకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అన్నా కాంటీన్ల పై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అన్నా క్యాంటీన్ల పేరిట వందల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లను పెట్టి టీడీపీ నేతలు ప్రచారానికి వాడుకున్నారని, వాటిని ప్రక్షాళన చేయాలని కోరారు.

ఈ క్యాంటీన్ల పేరిట తెలుగుదేశం పార్టీ నేతలు దోపిడీకి పాల్పడ్డారని, ఒక్కొక్క క్యాంటీన్‌కు రూ.40-50 లక్షలు ఖర్చు చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అయితే ఇది ఇలా ఉండగా అన్నా కాంటీన్లను నిర్వహిస్తున్న అక్షయపాత్ర నిర్వాహకులు మాత్రం తమ కాంట్రాక్టు పొడిగింపు పై ప్రభుత్వం నుండి ఎటువంటి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి బిల్లులు కూడా చాలా ఎక్కువగా పేరుకుపోయాయని సమాచారం.