Botsa-Satyanarayana-Praveen-Prakash-Teachers-Parvathipuram“అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకు వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకొంటే ఉపాధ్యాయులు ఎందుకు అభ్యంతరం చెపుతున్నారు?విద్యార్ధులకు పాఠ్యపుస్తకాలు అందజేయని అధికారులపై చర్యలు తీసుకోవద్దా?ఇలా అయితే విద్యావ్యవస్థ ఎలా బాగుపడుతుంది?” ఈ మాటలన్నది మరెవరో కాదు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.

పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్ ఇటీవల శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం మండలంలో ఓ పాఠశాలలో ఆకస్మిక తనికీలు చేసినప్పుడు 8వ తరగతి విద్యార్థులకు గణిత పాఠ్యపుస్తకాలు అందలేదని గుర్తించి, అందుకు ముగ్గురు అధికారులను బాధ్యులుగా చేసి వెంటనే సస్పెండ్ చేశారు.అయితే విద్యాశాఖ పాఠ్యపుస్తకాలను సకాలంలో అందించకుండా దిగువస్థాయి అధికారులపై చర్యలు తీసుకోవడంపై ఉపాధ్యాయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పుడు మంత్రి బొత్స సత్యనారాయణ ఈవిదంగా స్పందించారు.

పార్వతీపురం మన్యం జిల్లాలోని 15 మండలాల నుంచి సుమారు 1500 మంది ఉపాధ్యాయులు మంగళవారం జిల్లా కేంద్రంలో మెరుపు ధర్నా చేసి మంత్రి బొత్సకు షాక్ ఇచ్చారు. పాఠశాల విద్యాశాఖ సకాలంలో పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయకపోవడం వలననే ఈ సమస్య తలెత్తిందని, విద్యాశాఖ ఉన్నతస్థాయి అధికారులు తమ వైఫల్యాలకు దిగువస్థాయి అధికారులను బలి చేయడం ఏమిటని ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. మంత్రి బొత్స సమస్యను అర్దం చేసుకోకుండా తమను మందలించడం ఏమిటని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.

విద్యాశాఖలో పనిచేసే అధికారులందరినీ తాము కుటుంబ సభ్యులుగానే భావిస్తున్నామని, వారికి అన్యాయం జరిగినందునే వారి తరపున పోరాడుతున్నామని ఉపాధ్యాయ సంఘాల నాయకులు శ్రీనివాసరావు, ఎన్.బాలకృష్ణారావు, తవిటి నాయుడు, ఏ.సూర్యనారాయణ, మురళీమోహనరావు తదితరులు స్పష్టం చేశారు. ప్రవీణ్‌ ప్రకాష్ అధికారులను, ఉపాధ్యాయులను భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆయన తీరు మార్చుకోవాలని సూచించారు. ప్రభుత్వం తక్షణం స్థానిక అధికారులపై విధించిన సస్పెన్షన్ రద్దు చేయాలని లేకుంటే తమ పోరాటం ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు.

విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సొంత జిల్లాలోనే ఏర్పడిన ఈ సమస్యను ఆయన పరిష్కరించకపోగా ఉపాధ్యాయులను రెచ్చగొట్టే విదంగా మాట్లాడటం వలననే గోటితో పోయే సమస్య గొడ్డలి వరకు వచ్చిన్నట్లు స్పష్టమవుతోంది. దీంతో సిఎం జగన్‌ స్వయంగా కలుగజేసుకోవలసి వచ్చింది. అంటే ఇది మంత్రి బొత్స వైఫల్యమే కదా?

సిఎం జగన్‌ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌ నిశాంత్ కుమార్‌తో ఫోన్లో మాట్లాడి ఉపాధ్యాయులను శాంతింపజేయవలసిందిగా ఆదేశించారు. ఆయన వెంటనే వీరఘట్టం చేరుకొని ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులతో మాట్లాడి, పాఠ్యపుస్తకాలు అందకపోవడానికి ఎవరు కారణమో తానే స్వయంగా విచారణ జరిపి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తానని చెప్పి ధర్నా ఉపసంహరింపజేశారు.

ఇప్పటికే ఉపాధ్యాయులు, ప్రభుత్వోద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వారికి నెలనెలా సకాలంలో జీతాలు చెల్లించకపోగా ఈవిదంగా వారిపై కక్షసాధింపు చర్యలు కూడా చేపడితే వారి ఆగ్రహాన్ని తట్టుకోవడం కష్టమే అని మరోసారి నిరూపించారు. ఇప్పుడు మంత్రి బొత్స సత్యనారాయణ ఏమంటారో?