Botsa-Satyanarayanaనిన్న విశాఖపట్నం కలెక్టరేట్ లో ఒక సమీక్షా సమావేశం అనంతరం రాజ్యసభ ఏమీ విజయసాయిరెడ్డి మూడు రాజధానుల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సిఆర్డీఏ కేసులకు రాజధాని తరలింపుకు సంబంధం లేదని… ముఖ్యమంత్రి ఎక్కడ నుండి కావాలంటే అక్కడ నుండి పనిచెయ్యవచ్చని… తొందరలో విశాఖ కార్యనిర్వాహక రాజధాని అవుతుందని చెప్పుకొచ్చారు.

ఈరోజు మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ఏ క్షణమైనా మూడు రాజధానులు ఏర్పాటు కావచ్చని.. వీటికి సంబంధించిన పనులు ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. శాసనసభలో ఏ చట్టం చేశామో అదే జరిగి తీరుతుందని.. మూడు రాజధానుల ఏర్పాటు తరువాత సీఎం ఎక్కడి నుంచైనా పాలన చేయవచ్చని మంత్రి బొత్స పేర్కొన్నారు.

ఇటీవలే శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ ఆధిక్యం సంపాదించింది. మండలి చైర్మన్ గా టీడీపీకి చెందిన షరీఫ్ దిగిపోయారు. ఇప్పుడు అధికార పార్టీ కంట్రోల్ లోకి రాబోతుంది. దానితో బొత్స మాటలను బట్టి కోర్టు కేసులతో సంబంధం లేకుండా శాసనసభలో మూడు రాజధానుల బిల్లులను ఆమోదించుకుని విశాఖకు తరలిపోవాలని ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తుంది.

అయితే ఈ వరుస ప్రకటనలతో అమరావతికి భూములిచ్చిన రైతులు ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. ప్రభుత్వాన్ని నమ్మి భూములిచ్చిన రైతులు రెండేళ్లగా రోడ్డున పడినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు మరోసారి వారి కోర్టులనే నమ్ముకోబోతున్నారు. అయితే సంపూర్ణ మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని కోర్టులు ఏ మేరకు అడ్డుకోగలవు అనేది చూడాలి.