botsa-satyanarayana-on-capital-amaravatiజగన్ అధికారంలోకి వచ్చాకా అమరావతి భవిష్యత్తుపై నీలినీడలు అలముకున్నాయి. రాజధానిలోని ప్రాజెక్టులన్నీ ఆగిపోయాయి. రాజధాని నిర్మాణానికి రెండున్నర లక్షల బడ్జెట్ లో కేవలం 500 కోట్లు మాత్రమే కేటాయించడంతో అమరావతి మా ప్రాధాన్యత కాదు అని ప్రభుత్వం చెప్పకనే చెప్పింది. అదే సమయంలో ప్రపంచబ్యాంకు అమరావతికి ఇస్తామన్న ఋణం కూడా ఆపేసింది. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి జగన్ తాము అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం అని ప్రకటన చెయ్యలేదు.

ఈ క్రమంలో ప్రభుత్వం తన మనసులో మాట బయటపెడుతుందా? మునిసిపల్ శాఖా మంత్రి బొత్స ఆ వైపుగా ఒక కీలక వ్యాఖ్య చేశారు. స్థానిక ఆకాంక్షలు, రాష్ట్ర ఆర్దిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రాజధాని నిర్మాణం కొనసాగిస్తామని బొత్స సత్యనారాయణ చెప్పారు. మనకు ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధాని అవసరం లేదని, అది సాధ్యం కూడా కాదని ఆయన ఒక పత్రికతో మాట్లాడుతూ అన్నారు. దేశంలో మంచి రాజధానిగా ఉంటే చాలని ఆయన అన్నారు.

అదేక్రమంలో తాము నిపుణుల కమిటీ నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని, అది రాగానే ఆ కమిటీ చేసే సూచనలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పుకొచ్చారు. కాగా రాజదాని నిర్మాణంపై ఇంతవరకు జరిగిన తతంగంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయబోతోందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో అమరావతి లో అవినీతి జరిగిందనే పేరుతో మొత్తం ప్రాజెక్టును పక్కన పెడతారా అని రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారు.