Botsa Satyanarayanaగతంలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు అమరావతి రాజధాని అనేదానికి తాము కట్టుబడి ఉన్నాం అని చెప్పిన వారే. ఏమైందో ఏమో గానీ అధికారంలోకి వచ్చాకా మాట మార్చారు. వికేంద్రీకరణ అంటూ మూడు రాజధానుల పల్లవి అందుకున్నారు. పేరుకు మూడు రాజధానులైనా అసలైతే విశాఖపట్నమే రాజధాని.

అమరావతికి భూములిచ్చిన రైతుల కంట్లో మన్నే. అయితే గత కొన్ని రోజులుగా అమరావతే తమ రాజధాని అంటూ గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు అన్న మాటలను అన్నీ ఒక వీడియో చేసి సోషల్ మీడియాలోకి వదిలారు టీడీపీ వారు. ఆ వీడియో వైరల్ గా మారి అధికార పార్టీని ఇబ్బంది పెడుతుంది. దానితో ఆ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని తేల్చేశారు.

వెనుక, ముందు కట్‌ చేసిన వీడియోలను చంద్రబాబు జనాల్లోకి వదులుతున్నారని చిలక పలుకులు పలికారు. అమరావతి రాజధాని కాదని మీకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. అమరావతిలోనూ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తామని ఆయన అన్నారు. దానితో మాట మార్చడం అనేది మొత్తానికి పరిపూర్ణం చేసేశారు బొత్స గారు.

ఇది ఇలా ఉండగా రాజధానికి భూములిచ్చిన రైతులు కోర్టుల మీదే తమ ఆశలన్నీ పెట్టుకున్నారు. తాము ప్రభుత్వం తో చేసుకున్న అగ్రిమెంట్లను తుంగలో తొక్కితే కోర్టులు చూస్తూ ఉండవని వారి ఉద్దేశం. కేంద్రం ఇప్పటికే చేతులు దులిపేసుకోవడంతో ఇక కోర్టులు ఏం చెయ్యగలవో చూడాలి.