Botsa_Satyanarayana_Nara_Lokeshమన ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురించి అందరికీ తెలిసిందే. కాస్త ఆదాయం వచ్చే మంత్రిత్వశాఖ కోరుకొంటే సిఎం జగన్మోహన్ రెడ్డి ఆయనకి విద్యాశాఖ ఇచ్చారు. బొత్స సత్యనారాయణకి ఆ శాఖ ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రజలందరూ ముక్కున వేలేసుకొన్నారు. ఇక ఉపాధ్యాయుల సంగతి చెప్పనే అక్కరలేదు. కారణం అందరికీ తెలిసిందే. అందుకే సిఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా విద్యాశాఖ వ్యవహారాలపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ కీలక నిర్ణయాలు తీసుకోవడం అందరూ చూస్తూనే ఉన్నారు.

అయితే యువకుడు, ఉన్నత విద్యావంతుడు అయిన నారా లోకేష్‌ తన యువగళం పాదయాత్రలో పాఠశాలలు, విద్య, ఉద్యోగాలు సంబందిత అంశాలు, సమస్యలపై సాధికారికంగా మాట్లాడిన మాటలు విన్నప్పుడు, ఈ విషయాలన్నీ మన విద్యాశాఖ మంత్రి బొత్సవారికి తెలుసునా? అనే సందేహం కలుగుతుంది.

ఇంతకీ నారా లోకేష్‌ ఏం చెప్పారంటే, కొన్ని రోజుల క్రితం పాదయాత్రలో యువతని ఉద్దేశ్యించి మాట్లాడుతూ “ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు మళ్ళీ హైదరాబాద్‌ వెళ్ళి అమీర్ పేటలో సాఫ్ట్‌వేర్ కోచింగ్ తీసుకోవలసిన ఖర్మ ఏమిటి?అదేదో ఇంజనీరింగ్ కోర్సులోనే నేర్పించవచ్చు కదా?మేము అధికారంలోకి వస్తే అదే చేస్తాము. ఇంజనీరింగ్ చేసిన విద్యార్ధి ఐ‌టి కంపెనీలలో నేరుగా ఉద్యోగం సంపాదించుకొనేవిదంగా కర్రిక్యులం రూపొందిస్తాము,” అని చెప్పారు. యువత, విద్యావేత్తలు కూడా నారా లోకేష్‌ని ఇందుకు చాలా ప్రశంశిస్తున్నారు.

ఈరోజు సత్యవేడు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ, “ప్రభుత్వ పాఠశాలలకి రంగులు వేయిస్తే సరిపోదు. కేజీ నుంచి పీజీ వరకు సిలబస్ మొత్తం వాస్తవ ప్రపంచంలో మన విద్యార్థులు మనుగడ సాగించేందుకు తగినదిగా ఉండాలి. అప్పుడే విద్యార్థులు చదువులు పూర్తి చేసిన వెంటనే ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు. ఇప్పుడు గూగుల్ కూడా పాతబడిపోయి దాని స్థానంలో చాట్ జీ వచ్చేసింది. అలాగే విద్యావ్యవస్థ, సిలబస్ అంతా కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుండాలి. మనం ఎప్పుడూ ఎవరినో అనుకరించడమో లేదా ఎవరో చెపుతున్న పాఠాలని గుడ్డిగా బట్టీ వేయడం వలననో ప్రయోజనం ఉండదు. మనకి తగ్గట్లుగా మనకి అవసరమైన సిలబస్ రూపొందించుకొని ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుండాలి.

రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలు కూడా విద్యాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నాయి. కనుక వాటిని మనం శత్రువులుగా చూడరాదు. ప్రస్తుతం జగన్ రెడ్డి పాలనలో అవన్నీ చాలా సమస్యలు, వేధింపులు ఎదుర్కొంటున్నాయి. మేము అధికారంలోకి రాగానే వాటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రైవేట్ రంగంలో కూడా విద్యాభివృద్ధి జరిగేలా చేస్తాము.

ఇప్పుడు మన యువతకి కావలసింది ఉద్యోగాలు. ఉపాధి అవకాశాలు. జగన్ ప్రభుత్వం దీనిపై ఏమాత్రం దృష్టి పెట్టలేదు. మేము అధికారంలోకి రాగానే ముందుగా ఉపాధ్యాయుల భర్తీ చేస్తాము. జాబ్ క్యాలండర్ ప్రకటించి, ప్రభుత్వంలో ఉద్యోగాలు భర్తీ చేస్తాము. అయితే ప్రభుత్వంలో కంటే ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలని రప్పించేందుకు గట్టిగా కృషి చేస్తాము. దీని కోసం ప్రత్యేకమైన విధానాలని రూపొందించి అమలుచేస్తాము,” అని నారా లోకేష్‌ చెప్పారు.