botsa satyanarayana hints on andhra pradesh  capital amaravati changeఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిపై మునిసిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందని, త్వరలోనే దీనిపై నిర్ణయాన్ని ప్రకటిస్తామని బొత్స వెల్లడించారు. “అమరావతి ప్రాంతంలో నిర్మాణ వ్యయం సాధారణ వ్యయం కంటే ఎక్కువ అవుతోంది. ఫలితంగా ప్రజాధనం దుర్వినియోగమవుతోంది. ప్రభుత్వం విడుదల చేసే ప్రకటనలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం,” అని బొత్స ప్రభుత్వం అభిప్రాయమేంటో చెప్పకనే చెప్పారు.

“ఇటీవల సంభవించిన వరదలతో అమరావతిలో ముంపునకు గురయ్యే ప్రాంతాలు ఉన్నాయని తెలిసింది. దీని నుంచి రక్షణ పొందేందుకు రాజధాని ప్రాంతంలో కాల్వలు, డ్యామ్‌లు నిర్మించాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడుతుంది. దాంతో ప్రజాధనం వృథా అవ్వడం ఖాయం. వరద నీటిని ప్రత్యేకంగా తోడి బయటకు పంపించాల్సిన పరిస్థితి,” అని బొత్స విశాఖలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చెప్పుకొచ్చారు. దీనిపై టీడీపీ నేతలు విమర్శలు మొదలు పెట్టారు.

వరద నీరును రాయలసీమకు మళ్లించే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అమరావతి వైపు వరద మళ్ళించి రాజధానికి బ్యాడ్ నేమ్ వచ్చేలా చేసిందని ఆరోపిస్తున్నారు. రాజధాని మార్చడానికి బలమైన కారణం కావాలి గనుక ఈ వరద ముప్పు తెరమీదకు తెచ్చారని టీడీపీ వారు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో దానికి కేంద్రం సహకరిస్తుందో లేదో కూడా చూడాల్సి ఉంది. ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన తమ మొదటి బడ్జెట్ లో అమరావతి నిర్మాణానికి అరకొర నిధులు కేటాయించిన విషయం తెలిసిందే.