Botsa Satyanarayana fires on Chandrababu Naiduప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అమరావతి గ్రామాలలో ఈ నెల ఇరవై ఎనిమిదిన పర్యటించబోతున్నారు. ఈ క్రమంలో ఆయనపై పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అమరావతికి వస్తానన్న చంద్రబాబు ముందుగా తప్పు జరిగిందని ఒప్పుకుని అమరావతికి రావాలని బొత్స డిమాండ్ చేశారు.

ఆయన పాలించిన ఐదేళ్లలో రాజధానిలో ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. అమరావతిలో కేవలం నాలుగు బిల్డింగ్‌లు మాత్రమే కట్టారని మంత్రి బొత్స వివరించారు. నాలుగు బిల్డింగ్‌లు 70శాతం కట్టేందుకే రూ.4,900 కోట్లు ఖర్చు అయ్యాయా? అని ప్రశ్నించారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో 33వేల ఎకరాలు లాగేసుకున్నారని నిప్పులు చెరిగారు.

అయితే అనుకుని చెప్పారో అనుకోకుండా చెప్పారో గానీ బొత్స ఇంకో విషయం బయటపెట్టారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు డెవలప్‌చేసి అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి బొత్స తెలిపారు. ఇక్కడ ఆయన రాజధానిని మార్చాము అని మాత్రం చెప్పడం లేదు.

అమరావతిని చంద్రబాబు చెప్పిన స్థాయిలో డెవలప్ చేస్తేనే రైతులకు ఇచ్చే ప్లాట్స్ వల్ల ఉపయోగం. రాజధానిని తరలించి, అక్కడ ఎటువంటి అభివృద్ధి జరగకుండా ప్లాట్స్ ఇస్తే రైతులకు భారీ నష్టమే. వారు ఇచ్చిన పొలాలకు, ఇప్పుడు పొందబోయే ప్లాట్స్ కు అసలు పొంతన ఉండదు. అదే జరిగితే రైతులు మునిగినట్టే. అప్పుడు రైతులు తమకు ప్లాట్స్ వద్దని, తమ భూములు తమకు ఇవ్వాలని పోరాటం చెయ్యాల్సి ఉంటుంది.