Botsa Satyanarayanaవైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను అప్పుల ఊబిలోకి తోసేస్తుంది అని విమర్శలు వస్తున్నా ఆ పార్టీ నేతలు, మంత్రులు పెద్దగా పట్టించుకోవడం లేదు. పైగా తాము అప్పులు చేస్తున్నది అభివృద్ధి కోసమే అని చెప్పుకోవడం కొసమెరుపు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసింది అభివృద్ధి కోసమే కానీ అవినీతి చేయడం కోసం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు.

ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నామని, అందుకోసం అప్పులు చేస్తే తప్పేంటి అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు శాపనార్థాలే తమకు దీవెనలని బొత్స అన్నారు. ఆయన చేసిన తప్పులపై పశ్చాత్తాపం పడకుండా విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు.

అభివృద్ధి కోసం అప్పులు చేస్తే పర్లేదు… అయితే పప్పు బెల్లాల కోసం అప్పులు చేస్తున్నారు అదే ఇబ్బందికరంగా మారింది ఇప్పుడు. కనీసం రోడ్లు కూడా వెయ్యలేని దుస్థితి కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ లో అటువంటి తరుణంలో అభివృద్ధి కోసం అప్పులు చేస్తున్నాం అంటే నమ్మడానికి ఇబ్బందిగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

చంద్రబాబు దాదాపుగా ఐదేళ్లలో చేసిన అప్పు ఈ ప్రభుత్వం రెండేళ్లలోనే చేసేలా ఉంది. అయినా విమర్శించకూడదు అంటే కష్టమే మరి. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు తన తప్పులు గురించి పశ్చాత్తాపం పడితే సరిపోదు… అధికారపక్షం కూడా తప్పులు జరగకుండా చూసుకోవాలి… లేదంటే వారు కూడా ప్రతిపక్షంలోకి వచ్చి తప్పుల పై పశ్చాత్తాపం పడాల్సి రావొచ్చు అని కొందరు ఎద్దేవా చేస్తున్నారు.