Botsa Satyanarayana comments on govt Teachersవిద్యావిధానంలో మార్పులు ఆ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మెడకు గుదిబండలా చుట్టుకొన్నాయి. పాఠశాలల విలీనంపై ఉపాధ్యాయులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విజయవాడలో నిన్న మీడియాతో మాట్లాడుతూ, “పాఠశాలల విలీనంపై విద్యార్థులు, తల్లితండ్రులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తే అర్దముంది కానీ ఉపాధ్యాయులు అభ్యంతరాలు వ్యక్తం చేయడమే ఆశ్చర్యంగా ఉంది. వారికి ప్రతీనెలా టంచనుగా జీతాలు చెల్లిస్తూ పిల్లలకు 8 గంటలు పాఠాలు చెప్పమంటే అదీ కష్టమంటున్నారు. చీటికి మాటికీ ఏదో కారణంతో ధర్నాలు చేస్తూ ప్రభుత్వాన్ని బెదిరిస్తామంటే కుదరదని గ్రహిస్తే మంచిది.

అయినా ఉపాధ్యాయుల అభిప్రాయాలు తీసుకొన్న తరువాతే పాఠశాలల విలీనం చేస్తున్నాము కదా? ఉపాధ్యాయులు కోరితేనే జీవో 117ని సవరించి జీవో 118 ఇచ్చాము. అప్పుడు ఒప్పుకొని ఇప్పుడు అభ్యంతరాలు ఎందుకు చెపుతున్నట్లు?ఒకవేళ పాఠశాలల విలీనం సరికాదు వద్దంటే… ప్రత్యామ్నాయం ఏమిటో చెప్పమనండి.

రాష్ట్రంలో 5,800 పాఠశాలలను మ్యాపింగ్ చేస్తే వాటిలో కేవలం 400 పాఠశాలల విలీనంపైనే అభ్యంతరాలు వచ్చాయి. అంటే మిగిలిన పాఠశాలల విలీనంలో ఎటువంటి ఇబ్బందులు, అభ్యంతరాలు లేనట్లే కదా? అభ్యంతరాలపై చర్చించి పరిష్కరించదానికి ఓ కమిటీని కూడా వేశాము. ఇంతకంటే ఏమి చేయాలి?

ఉపాధ్యాయులకు ఏవైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాను కానీ ధర్నాలు చేసి బెదిరించాలని చూస్తే సహించబోను,” అని హెచ్చరించారు.

ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం, ప్రభుత్వం అధ్వర్యంలో నడుస్తున్న విద్యావ్యవస్థలో బైజూ ప్రైవేట్ సంస్థను తీసుకువస్తుండటం, ఇప్పుడు ఈ పాఠశాలల విలీనంతో విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం మాకు జీతాలు చెల్లిస్తూ మద్యలో బైజు సంస్థతో పిల్లలకు పాఠాలు చెప్పించడం ఏమిటని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ఊళ్ళకు సమీపంలో పాఠశాలలు ఉన్నపుడే డ్రాప్ అవుట్స్ ఉంటున్నాయి ఇప్పుడు విలీనం పేరుతో ఊరికి దూరంగా ఉండే పాఠశాలలలో చదువుకొమంటే డ్రాప్ అవుట్స్ ఇంకా పెరగవా?అని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ఇంగ్లీషు మీడియంలో చదువుకొంటేనే విద్యార్థులు జీవితంలో రాణిస్తారని ప్రభుత్వ వాదన చాలా హాస్యాస్పదంగా ఉందని ఉపాధ్యాయులు వాదిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వంటివారు మాతృభాషలో విద్యాబోధన జరగాలని చెపుతుంటే, జగన్ ప్రభుత్వం ఇంగ్లీషు మీడియంపై ఎందుకు ముచ్చటపడుతోందని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.