Botsa_Satyanarayanaకందుకూరు, ఉయ్యూరు ఘటనలతో వైసీపీ ప్రభుత్వం హడావుడిగా జీవో నంబర్:1 తీసుకు వచ్చింది. దానిని అమలుచేయాల్సిన బాధ్యత పోలీసులదే కనుక వారు కుప్పంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలని అడుగడుగునా అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే ప్రభుత్వం ఈ జీవో తెచ్చిందని చంద్రబాబు నాయుడుతో సహా రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయ పార్టీలకి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించుకొనేందుకు రాజ్యాంగం ఇచ్చిన ప్రాధమిక హక్కులని కాలరాస్తూ వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని వాదిస్తున్నారు. జీవోలో అనేక నిబందనలు రూపొందించి వాటితో ప్రతిపక్షాల సభలు, సమావేశాలకి అనుమతించకుండా అడ్డుకోవాలని వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు పర్యటనలో అది ప్రత్యక్షంగా కనబడుతోంది కూడా. కనుక ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలని తిప్పి కొట్టేందుకు మంత్రులు రంగంలో దిగారు.

విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ శనివారం మీడియాతో మాట్లాడుతూ, “అసలు ఆ జీవోలో ఏముందో చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ చదివారా? దానిలో ప్రతిపక్షాలు సభలు, సమావేశాలు నిర్వహించుకోకూడదని ఎక్కడైనా ఉందా? ఉంటే ఎక్కడుందో మాకు తెలియజేయాలి. ప్రభుత్వానికి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది కనుక కందుకూరు, ఉయ్యూరు వంటి ఘటనలు మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. అందుకే ప్రతిపక్షాలను ప్రజలకి ఇబ్బంది, ప్రాణాలు బలిగొనేలా రోడ్లపై సభలు, సమావేశాలు వద్దని, పోలీసులు సూచించిన ప్రదేశాలలో జరుపుకోవాలని మాత్రమే జీవో పేర్కొన్నాము. కానీ చంద్రబాబు నాయుడుకి వయసు మీద పడటంతో సభలు, సమావేశాలు నిర్వహించే ఓపికలేక ఇంట్లో కూర్చోవాలనే ఉద్దేశ్యంతో ఈ జీవోని సాకుగా చూపుతున్నారు.

ఆయనకి మద్దతు పలికే కొన్ని పార్టీలు, కొన్ని న్యూస్ ఛానల్స్ కూడా ఈ జీవోకి వక్ర భాష్యాలు చెపుతూ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నాయి. ఆ జీవో ప్రతిపక్షాలకి మాత్రమే వర్తింపజేస్తున్నారని, మా వైసీపీ మంత్రుల సభలకి వర్తింపజేయడం లేదని దుష్ప్రచారం చేస్తున్నాయి. కానీ మేమే రాష్ట్రంలో అధికారంలో ఉన్నాము కనుక మరింత బాధ్యతగా మెలగాల్సి ఉంటుంది. ప్రజలకి ఎటువంటి ఇబ్బందీ కలగకుండా ఆ జీవో ప్రకారమే మేము కూడా సభలు, సమావేశాలు జరుపుకొంటున్నాము. కనుక ప్రతిపక్షాలు ముందుగా ఆ జీవోలో ఏముందో చదువుకొని మాట్లాడితే బాగుంటుంది,” అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

ఈ జీవోలో ప్రతిపక్షాలని సభలు, సమావేశాలు పెట్టుకోవద్దని ఎక్కడా చెప్పలేదు కానీ పెట్టుకోకుండా అడ్డుకొనేందుకు అనేక నిబందనలు పొందుపరిచారు. వాటన్నిటినీ పాటిస్తూ సభలు, సమావేశాలు జరుపుకోవడం అసంభవం. కనుకనే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆ జీవోలో నిబందలను సాకుగా చూపుతూ పోలీసులు ప్రతిపక్షాల సభలకి అనుమతులు నిరాకరిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడుకి సభలు నిర్వహించడానికి ఒంట్లో ఓపిక లేక ఆ జీవోని సాకుగా చూపి ఇంట్లో కూర్చోవాలనుకొంటున్నారని, ప్రెస్‌మీట్‌లు తప్ప బహిరంగసభలు, ర్యాలీలలో పాల్గొని మాట్లాడలేని బొత్స వంటివారే ఆ జీవోకి వక్ర భాష్యాలు చెపుతున్నారు కదా?