botsa satyanarayana about 10th class copy issueప్రస్తుతం జరుగుతున్న పదో తరగతి పరీక్షలలో మాస్ కాపీయింగ్ జరిగాయని, ఇందుకు బాధ్యులైన 30మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేశామని, మరో 44 మందిని పోలీసులు అరెస్ట్ చేశారని రాష్ట్ర పరీక్షల డైరెక్టర్ డి. దేవానంద్ రెడ్డి రెండు రోజుల క్రితమే చెప్పారు.

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నిన్న విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, “ఎక్కడా ఎటువంటి పొరపాట్లు జరుగలేదు. మా ప్రభుత్వం చాలా పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నందునే 60 మందిని రెడ్‌ హ్యాండ్‌గా పట్టుకొని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశాము. వారిలో 36 మంది ఉపాధ్యాయులు, ఇద్దరు బోధనేతర సిబ్బంది, ఏడుగురు విద్యార్దులు ఉన్నారు.

ఉపాధ్యాయులపై ఊరికే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే ఉపాధ్యాయ సంఘాలు ఊరుకొంటాయా?జరిగిన దానికి వారూ బాధపడుతున్నారు. పరీక్షలలో మంచి ఫలితాలు రాబట్టాలని ఉపాధ్యాయులను కోరామే తప్ప రాకపోతే ఇంక్రిమెంట్ కట్ చేస్తామని బెదిరించలేదు.

టిడిపి నేతలు లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తూ మా ప్రభుత్వంపై బురద జల్లాలని ఎప్పుడూ ప్రయత్నిస్తుంటుంది. అందుకే పదో తరగతి పరీక్షలపై కూడా ఇటువంటి లేనిపోని ఆరోపణలు చేస్తోంది,” అని అన్నారు.

ఎక్కడా ఎటువంటి పొరపాట్లు జరగలేదని చెపుతూనే, మళ్ళీ 36 మంది ఉపాధ్యాయులు, ఇద్దరు బోధనేతర సిబ్బంది, ఏడుగురు విద్యార్దులను అరెస్ట్ చేసి వారిపై క్రిమినల్ కేసులు పెట్టామని చెప్పి జరుగుతున్న నిర్వాకాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ స్వయంగా దృవీకరించారు కదా?

మంత్రి పదవి నుంచి తనను తప్పించాలనే ప్రతిపక్షాల డిమాండ్‌పై బొత్స ఇదేమి తనకో లెక్క కాదన్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడటం విశేషం. “నేను ఇప్పటి వరకు 13 ఏళ్లపాటు మంత్రిగా పనిచేశాను కనుక ఈ మంత్రి పదవి మహాభాగ్యం కాదు,” అని అన్నారు. మరి దీనిపై సిఎం జగన్మోహన్ రెడ్డి ఏమంటారో?