Botsa Satyanarayana 10th class exam resultsమొన్న శనివారం పదో తరగతి ఫలితాలు రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ విడుదల చేయాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వలన వాయిదా వేస్తున్నట్లు చివరి నిమిషంలో ప్రకటించడంతో విద్యార్దులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇవాళ్ళ (సోమవారం) మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేస్తారని విద్యాశాఖ ప్రకటించింది.

ఈసారి విద్యార్దుల మార్కులు ప్రకటిస్తామని, కానీ విద్యాసంస్థలు వాటిని చూపి ర్యాంకులు సాధించామని ప్రచారం చేసుకొంటే కటిన చర్యలు తప్పవని విద్యాశాఖ హెచ్చరించింది. ఆవిదంగా చేసిన విద్యాసంస్థల యాజమాన్యాలకు, వాటి నిర్వాహకులకు లక్ష రూపాయలు జరిమానాతో పాటు మూడు నుంచి ఏడేళ్ళ వరకు జైలు శిక్ష కూడా తప్పదని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ హెచ్చరించారు. ఈ మేరకు జీవో (నంబర్: 83)ని కూడా జారీచేశారు.

శనివారం పదో తరగతి ఫలితాలు ప్రకటించకుండా వాయిదా వేయడంపై ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందిస్తూ, “మద్యం వ్యాపారాలు చేసుకొనే బొత్స సత్యనారాయణకి విద్యాశాఖను అప్పగిస్తే మరి ఇలాగే ఉంటుంది. పదో తరగతి పరీక్షలు సక్రమంగా నిర్వహించలేకపోగా కనీసం ఫలితాలు కూడా చెప్పిన సమయానికి ప్రకటించలేకపోయారు. వైసీపీ ప్రభుత్వం విద్యార్దుల జీవితాలతో ఆటలాడటం సరికాదు,” అని అన్నారు.

శనివారం పదో తరగతి ఫలితాలు ప్రకటించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని విద్యాశాఖ చెప్పింది. కానీ ఆఖరి నిమిషంలో ‘అనివార్య కారణాల వలన’ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆ అనివార్య కారణమేమిటంటే బహుశః విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తన చేతుల మీదుగా విడుదల చేయాలని ఆదేశించినందునే అని తాజా నిర్ణయంతో స్పష్టం అవుతోంది.

విద్యాశాఖ వ్యవహారాల గురించి, విద్యా సంబందిత విషయాల గురించి మంత్రి బొత్సకు పెద్దగా అవగాహన లేనందున కనీసం ఇటువంటి కార్యక్రమాలైన తన చేతుల మీదుగా నిర్వహించి తన విద్యాశాఖలో తన పవర్ చాటుకోవాలనుకొంటున్నారేమో?అని ప్రజలు ముసిముసి నవ్వులు నవ్వుకొంటున్నారు.