bopparaju-venkateswaruluవిజయవాడలో ఏపీ రెవెన్యూ భవన్‌లో శుక్రవారం ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు అత్యవసర సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏపీ జెఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, “ఉద్యోగులు తమ కుటుంబ అవసరాల కోసం పొదుపు చేసి దాచుకొన్న సొమ్మును కూడా ప్రభుత్వం వాడేసుకొంటే ఎలా?ఆ సొమ్ము గురించి, మనకు రావలసిన డీఏ బకాయిల గురించి ఆరు నెలలుగా అధికారులను అడుగుతూనే ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ సమస్యలను సిఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళితే ఈ ఏడాది జూలై నెలాఖరులోగా సొమ్ము వాపసు చేస్తానని, డీఏ బకాయిలు చెల్లిస్తామని మాట ఇచ్చారు. ఆగస్ట్ నెల కూడా మొదలైపోయింది కానీ ఇంతవరకు డీఏ బకాయిలు చెల్లించలేదు కనీసం మన సొమ్మును మనకు తిరిగి ఇవ్వలేదు.

గతంలో మనం జీతాల పెంపు గురించి ఆందోళనలు చేశాము. కానీ ఇప్పుడు మనం దాచుకొన్న సొమ్ము తిరిగి తెచ్చుకోవడానికి ఉద్యమం మొదలుపెట్టవలసి వచ్చేలా ఉంది. పరిస్థితి అంతవరకు రాకుండా ప్రభుత్వం తక్షణం మా బకాయిలు, మేము పొదుపు చేసి దాచుకొన్న సొమ్మును తక్షణం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాము,” అని అన్నారు.

సెక్రెటరీ జనరల్ వైవి రావు మాట్లాడుతూ, “గతంలో ఎన్నడూ ఈవిదంగా జరగలేదు. ఉద్యోగులు దాచుకొన్న సొమ్మును తీసి ప్రభుత్వం వాడేసుకోవడం ఏమిటి?జీపీఎఫ్, ఏపీ జీఎల్ఐ, మెడికల్ రీయింబర్స్‌మెంట్, సరేందర్ లీవులు… మనం పైసా పైసా పోగేసి మన కుటుంబ అవసరాల కోసం దాచుకొన్నాము. కానీ ఇప్పుడు ఆ సొమ్ము మన చేతిలో లేకపోవడంతో పిల్లల పెళ్ళిళ్ళు, ఉన్నత చదువులు, వైద్య ఖర్చుల కోసం మళ్ళీ చెయ్యి జాపవలసి వస్తోంది. ఇదేం ఖర్మ?మళ్ళీ మరో ఉద్యమం చేస్తే తప్ప మన సొమ్ము మనకి దక్కే పరిస్థితి కనబడటం లేదు,” అని అన్నారు.

జగన్ ప్రభుత్వం ఓ పక్క లక్షల కోట్లు అప్పులు చేస్తూనే మళ్ళీ ఈవిదంగా ఉద్యోగులు దాచుకొన్న సొమ్మును కూడా తీసి వాడుకోవడం చాలా దారుణం. ఈవిషయం బయటకి పొక్కితే ప్రభుత్వం పరువు పోతుందని తెలిసి ఉన్నా నిర్లజ్జగా వ్యవహరిస్తుండటం విస్మయం కలిగిస్తుంది. రసికరాజు గోరంట్ల మాధవ్ చేష్టలతో ప్రజలు సిగ్గుతో తలదించుకొంటున్నారు. ఇప్పుడు ఉద్యోగ సంఘాలు తమ సొమ్ము వాపసు చేయాలంటూ సమ్మెకు దిగితే దేశ ప్రజలందరికీ కూడా ఈవిషయం తెలుస్తుంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పరువు కూడా పోతుంది.