Bonda-Umaసిఎం జగన్మోహన్ రెడ్డి నిన్న తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైసీపీ మంత్రులు, ఎమ్మేల్యేలు గడప గడపకి కార్యక్రమంలో పాల్గొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “నేను బటన్ నొక్కి డబ్బులు ప్రజలకు అందజేస్తుంటే, మీరు ప్రజల వద్దకు వెళ్ళి అదే విషయం చెప్పడానికి ఏమి కష్టం?” అంటూ నిలదీశారు. ఆయన ప్రశ్నకు వారు జవాబు ఇవ్వలేదు కానీ టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్యే బోండా ఉమా ధీటుగా స్పందించారు.

“బటన్ నొక్కితే పడుతోన్న డబ్బులు ఆకాశంలో నుంచో, నీ సొంత ఖాతాలో నుంచో రావట్లేదు సిఎం జగన్ రెడ్డి.. ప్రజల నడ్డి విరుస్తూ వసూలు చేస్తోన్న పన్నులు, ఇష్టా రాజ్యాంగ చేస్తున్న అప్పులవే. అభివృద్ధి చేయమని అధికారమిస్తే బటన్ నొక్కడమే గొప్ప పని అని చెప్పుకోవడం జగన్ రెడ్డి అజ్ఞానానికి నిదర్శనం,” అని ట్వీట్ చేశారు.

ఎమ్మెల్యే బోండా ఉమా చెప్పిన విషయం చాలా ఆలోచించవలసిన విషయమే. ఎందుకంటే, సిఎం జగన్మోహన్ రెడ్డి మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ సంక్షేమ పధకాల పేరుతో ప్రజలకు ఇస్తున్న డబ్బు వారి సొంత జేబుల్లో నుంచి ఇచ్చి ఉద్దరిస్తున్నట్లు మాట్లాడుతుంటారు. సంక్షేమ పధకాల కోసం విచ్చలవిడిగా అప్పులు చేస్తూ నానాటికీ ప్రజలపై భారం పెంచుతూ మళ్ళీ వారిని ఉద్దరించినట్లు మాట్లాడుతుండటం సిగ్గుచేటు. మళ్ళీ ఆ సంక్షేమ పధకాలలో కూడా కోతలు విధిస్తూండటం ఇంకా సిగ్గుచేటు. వచ్చే ఎన్నికలలో వైసీపీని గెలిపించుకొనేందుకే జగన్ బటన్ నొక్కుతున్నారు తప్ప ప్రజలపై ప్రేమతో కాదని అందరికీ తెలుసు. ‘నేను బటన్ నొక్కి డబ్బులు పంచుతుంటాను… మీరందరూ ప్రజల వద్దకు వెళ్ళి ఆ విషయం తెలియజేసి మనకే ఓట్లు వేయాలని అడగమని నిసిగ్గుగా చెప్పుకోగలడం సిఎం జగన్మోహన్ రెడ్డికే చెల్లు!