Bonda Uma as YSRCP East Constituency Inchargeవిదేశీ పర్యటనలో ఉన్న మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా ఆయన చేసిన బంగీ జంప్‌ దృశ్యాలతో పాటు ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించడం విశేషం. టీడీపీ నేతల్లోనే కాదు రాజకీయ వర్గాల్లోనూ ఈ ట్వీటుపై చర్చ ప్రారంభమైంది. కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆయన చేసిన ట్వీటుతో పార్టీ మారడం ఖాయమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ఆయన వైఎస్సార్ కాంగ్రెస్లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన అనుచరులు ఇదే అంశాన్ని ధ్రువీకరిస్తున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా బోండా ఉమను వైఎస్సార్ కాంగ్రెస్ గట్టిగా టార్గెట్ చేసేది. రవాణా శాఖ నాటి కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యంపై దౌర్జన్యం వ్యవహారంలో ఆయన కమిషనర్‌ గన్‌మెన్‌పై చేయి చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. స్వాతంత్య్ర సమరయోధునికి చెందిన స్థలాన్ని స్థిరాస్తి వ్యాపారం కోసం బొండా ఉమా అనుచరులు కబ్జా చేశారని కూడా వైఎస్సార్ కాంగ్రెస్ ఆరోపించింది.

ఇప్పుడు ఆయనకు పార్టీలోకి ఎర్ర తివాచి పర్చడం విశేషం. ఆయన పార్టీలో చేరితే తూర్పు నుంచి పోటీ చేసే అవకాశం ఉందని అనుచరులు చెబుతున్నారు. ఇటీవలే ఎన్నికలలో విజయవాడ మధ్య నియోజకవర్గం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసిన బొండా కేవలం 25 ఓట్ల తేడాతో ఓడిపోయారు. వైకాపా తరఫున పోటీ చేసిన మల్లాది విష్ణు ఈ స్థానం నుంచి అతి తక్కువ ఆధిక్యతతో గెలిచారు. దీనిపై బొండా ఉమా పోరాడినా ప్రయోజనం లేకుండా పోయింది. రీకౌంటింగ్‌ డిమాండ్‌ చేసినా ఎన్నికల అధికారి అనుమతించలేదు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి పిటిషన్‌ దాఖలు చేశారు. దాన్ని కొట్టివేశారు.