Anurag Kashyapగ్యాంగ్స్ అఫ్ వసేపూర్ దర్శకుడిగా అనురాగ్ కశ్యప్ కు చాలా ప్రత్యేక స్థానం ఉంది . బ్లాక్ ఫ్రైడే, దేవ్ డి లాంటి వెరైటీ ప్రయోగాలతో తానో డిఫరెంట్ ఫిలిం మేకరని నిరూపించుకున్నాడు. అయితే ఇతగాడి ట్రాక్ రికార్డు గత కొంత కాలంగా శృతి తప్పుతోంది. నటుడయ్యాక క్రియేటివిటీ తగ్గిపోయింది. ఆ మధ్య తాప్సీ ప్రధాన పాత్రలో దోబారా అనే కళాఖండం తీస్తే కనీసం పోస్టర్లు ట్రైలర్ల ఖర్చులు కూడా లేదు. తాజాగా కెన్నెడీ అనే థ్రిల్లర్ తీశారు. కేన్స్ చిత్రోత్సవంలో ప్రదర్శనకు అర్హత దక్కింది. థియేటర్ రిలీజ్ కి కనీస బజ్ లేదు.

ఎలాగైనా దీనికి హైప్ రావాలంటే సౌత్ హీరోలను టార్గెట్ చేసి స్టేట్ మెంట్ ఇస్తే ప్రాధాన్యం వస్తుందని ఆలోచించాడు. అదే చేశాడు. విక్రమ్ కు కొన్నేళ్ల కిందట ఈ కథ మెయిల్ చేస్తే చూడలేదని ఫోన్ చేస్తే స్పందించలేదని ఓ ఇంటర్వ్యూలో ఏదేదో అనేశాడు. సహజంగా వీటికి దూరంగా ఉండే చియాన్ ట్విట్టర్ లో స్పందిస్తూ అప్పట్లో విషయం తెలిశాక స్వయంగా తనే ఫోన్ చేసిన సంఘటన గుర్తు చేశాడు. అనురాగ్ ఏదో కవర్ చేయబోయాడు కానీ అడ్డంగా దొరికిపోయిన మాట వాస్తవం. సో ప్రమోషన్ కోసం దక్షణాది స్టార్ ని టార్గెట్ చేయడంతో ఇలా వర్కౌట్ అయ్యింది.

ఇలాంటి ఉదంతాలు, ఫేక్ పబ్లిసిటీ గిమ్మిక్కులు, ఓర్చుకోకపోవడాలు ఇప్పటివి కాదు. మైనే ప్యార్ కీయా టైంలో ఎస్పి బాలసుబ్రమణ్యం గొంతు తమకు ఎసరు పెట్టేలా ఉందని ముంబై గాయకులందరూ సంగీత దర్శకులను బ్లాక్ మెయిల్ చేసినంత పని చేశారు. మహేష్ భట్ చిరంజీవి, నాగార్జునలతో హిందీ సినిమాలు తీసినప్పుడు వాటి మీద నెగటివ్ రివ్యూలు ఇచ్చేవాళ్ళు. బాహుబలి ఇప్పటికీ చూడని ముంబై స్టార్లు ఉన్నారంటే అబద్దం కాదు. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ వచ్చాక అభినందిస్తూ ట్విట్ చేసిన నార్త్ సెలబ్రిటీలను వేళ్ళ మీద లెక్కెట్టొచ్చు.

ఇదంతా సౌత్ సినిమా డామినేషన్ వల్ల కలిగిన దుగ్ధ అసూయ తప్ప మరొకటి కాదు. ఏదో ఒక రకంగా ఇక్కడి హీరోలనో ఇండస్ట్రీనో తేలికగా మాట్లాడితే హైలైట్ అవుతామనే తాపత్రయం. ఎందుకంటే బాలీవుడ్ కి నాటు నాటు లాంటి పాట లేదు. జపాన్ లో ఆర్ఆర్ఆర్ ని దాటేస్తామన్న నమ్మకం రాదు. ప్రభాస్ లాగా మూడు నాలుగు వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ఒకేసారి సెట్స్ మీద పెట్టే సత్తా ఉన్నోడు వాళ్లకు కనిపించడు. కమర్షియల్ కథలతోనూ వందల కోట్లు వసూలు చేసే మన టెక్నిక్ వాళ్లకు వంటబట్టదు. అందుకే సులభంగా ఇలాంటి మార్గాలను ఎంచుకుని తమ సినిమాలను ప్రమోషన్ చేసుకోవడమే.