bollywood critics on Ram Charan RRR Trailerబాలీవుడ్ లో తెలుగు హీరోలు సినిమాలు చేసి విజయవంతం అయిన వారు లేరు. చిరంజీవి నుండి రామ్ చరణ్ వరకు చాలా మంది హీరోలు ఒకటి, రెండు సినిమాలతోనే సర్ధేసుకున్నారు. ఇందుకు ప్రభాస్ ఒక్కడే మినహాయింపు. మనోళ్లు చూడని ‘సాహో’ సినిమాను కూడా బాలీవుడ్ ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్నారు. అదే ఊపులో త్వరలో “రాధే శ్యామ్” కూడా రిలీజ్ కు రెడీ అయ్యింది.

హిందీలో చేసిన తెలుగు హీరోలలో ఎవరికి జరగని అవమానం “జంజీర్” సినిమా సందర్భంలో జరిగింది. తెలుగులో ‘తుఫాన్’ పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమాకు క్రిటిక్స్ 1, 1.5 రేటింగ్స్ ఇవ్వగా, ఆ ఏడాది అత్యంత ఉత్తమమైన చెత్త సినిమాగా ‘తుఫాన్’ను పేర్కొనడం చిత్ర యూనిట్ తో పాటు హీరోగా రామ్ చరణ్ కు తీరని అవమానంగా మారింది.

అప్పటినుండి మళ్ళీ బాలీవుడ్ ఊసెత్తని చెర్రీ, ఇపుడు “ఆర్ఆర్ఆర్” రూపంలో జనవరి 7వ తేదీ నుండి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ట్రైలర్ లో కనిపించిన విధానంతో, ఇంతకుముందు చరణ్ నటనపై చేసిన కామెంట్స్ కు పరోక్షంగా బదులిచ్చినట్లే కదా అని మెగా అభిమానులు పేర్కొంటున్నారు.

ట్రైలర్ తో బాలీవుడ్ మీడియాను బిత్తరపోయేలా చేసిన చెర్రీ, ఎక్కడ అవమానపడ్డారో అక్కడే తిరిగి జెండా పాతడానికి సిద్ధమైనట్లుగా కనపడుతోంది. యాదృశ్చికమో ఏమో గానీ, నేడు ముంబైలో జరిగిన “ఆర్ఆర్ఆర్” ఈవెంట్ కు కూడా చెర్రీ గైర్హాజరయ్యారు. బహుశా సక్సెస్ తో సమాధానం చెప్పిన తర్వాతే ముంబైలో అడుగు పెడతారేమో!