bolisetty satyanarayana counter to gurrampati devendra reddyప్రత్యర్థి రాజకీయ నేతలు ఏ విషయంలో దొరుకుతారా? విమర్శలు చేసేద్దాం అని ఎదురు చూస్తున్న రోజులివి. చిన్న చిన్న విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో, చివరికి అవి ప్రధానాంశాలుగా మారిపోతున్నాయి. ఆ క్రమంలోనే తమ ప్రత్యర్థి నేత అయిన ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడానికి ప్రయత్నించిన వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ కు అక్షింతల వెల్లువ కొనసాగుతోంది.

“ఎయిర్ పోర్ట్ లో… అది కూడా జనం తిరిగే చోట, కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్క్ పెట్టుకోవాలని ఎయిర్ పోర్ట్ ఆఫీసర్ చెప్తే గానీ తెలియని నువ్వు సైనిక్స్ కి ఏమని దిశానిర్దేశం చేస్తావ్ పవన్ కళ్యాణ్?” అంటూ వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ గా వ్యవహరిస్తోన్న గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. అయితే కనీస జ్ఞానం కూడా లేకుండా గుర్రంపాటి విమర్శలు చేస్తున్నారనేది అసలు తేలిన విషయం.

ఈ పోస్ట్ పై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు. “విమానాశ్రయాలలో ఐడి చూసేటప్పుడు ఫేస్ మాస్క్ తీయాలని, తీస్తారన్న పాటి జ్ఞానం లేని గుర్రంపాటికి గాడిదపాటి జ్ఞానం లేదా?” అంటూ మండిపడ్డారు. ఆ మాటకొస్తే ఒక్క జనసేన వర్గీయులే కాదు, కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరూ గుర్రంపాటి పోస్టింగ్ పై తీవ్రంగా స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయాలనే ఉద్దేశం తప్ప ఈ పోస్టింగ్ లో మరొకటి లేదనేది అంతిమంగా తేల్చిన విషయం.

పవన్ విషయం కాసేపు పక్కన పెడితే, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సమయంలో తప్ప, ఇతర ఏ పబ్లిక్ ఈవెంట్స్ లో కూడా మాస్క్ పెట్టిన దాఖలాలు లేవని ఈ సందర్భంగా జనసైనికులు గుర్తు చేస్తున్నారు. ముందు మీ సొంత పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని కరోనా నిబంధనలకు అనుగుణంగా మాస్క్ పెట్టుకుని పబ్లిక్ ఈవెంట్స్ లో పాల్గొనమన్న సలహాలకు కొదవలేదు.

అయినా ఎయిర్ పోర్ట్ లో పవన్ వెళ్తున్న విషయం, అలాగే కరెక్ట్ గా మాస్క్ పెట్టుకున్నప్పుడే వీడియో బయటకు వదలడం అంటే… జనసేన అధినేత ఎక్కడెక్కడికి వెళ్తున్నారోనని విచారణ చేస్తున్నారా? ఎయిర్ పోర్ట్ లలో సెలబ్రిటీల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం సహజమే. విమానాశ్రయంలోకి ప్రవేశిస్తున్న సమయంలో సెలబ్రిటీల పిక్స్ ఎక్కువగా బయటకు వస్తుంటాయి గానీ, ఇలా ఎయిర్ పోర్ట్ అధికారి వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నపుడు కాదు. దీంతో పవన్ పై స్పై పెట్టారా? అన్న అనుమానాలకు తావిచ్చేలా ఈ వీడియో నిలుస్తోంది.

గుర్రంపాటి పెట్టిన ఈ పోస్టింగ్ ద్వారా తేలింది ఏమిటంటే… ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడతారు అన్న చందంగా వైసీపీ నేత వేసిన ట్వీట్ కు ఆయనే బలవుతున్నారు. వైసీపీ ఫేక్ ప్రచారాలకు ఇదొక నిదర్శనంగా తెలుగు తమ్ముళ్లు కూడా పేర్కొంటున్నారు. వైసీపీ నేతల జీవితమంతా ఇలాంటి ఫేక్ ప్రచారాలతో పబ్బం గడుపుకోవడం తప్ప, ప్రజలకు సేవ మాత్రం చేయడం లేదనేది ప్రతిపక్షాల ఆరోపణలు.