Bode prasad respond to ys jagan allegationsవిజయవాడ వేదికగా వెలుగుచూసిన ‘కాల్ మనీ’ కేసులో అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై తీవ్ర ఆరోపణలు రావడంతో ఓ విధంగా తెలుగుదేశం పార్టీ డిఫెన్స్ లో పడిన మాట వాస్తవమే. అధికారంలో ఉన్న పార్టీ వర్గీయులు కావడంతో, ఈ స్కాంలో వెలువడుతున్న ఆరోపణలను ఓ విధంగా ప్రజలు కూడా విశ్వసించే పరిస్థితి నెలకొంది. కానీ, వీటన్నింటినీ వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ సమావేశాల రెండవ రోజున పటాపంచలు చేసారు. ‘కాల్ మనీ’ ఉదంతంలో అధికార పక్షం నాయకుల ప్రమేయం లేదని జగన్ ద్వారా రుజువయ్యింది.

‘కాల్ మనీ’ కేసుపై చర్చ చేపట్టాలని పట్టుబట్టిన జగన్ వర్గీయుల ఆకాంక్ష శుక్రవారం మధ్యాహ్నం తీరిపోయింది. ‘కాల్ మనీ’ చర్చ ప్రారంభించడంతో జగన్ మొదలెట్టిన ప్రసంగంతో… కేసులో తెలుగుదేశం పార్టీ నేతల ప్రమేయంపై ఓ క్లారిటీ వచ్చేసింది. జగన్ ఆరోపణలు చేస్తున్న బోడే ప్రసాద్, బుద్దా వెంకన్న, గద్దె రామ్మోహన్, చంద్రబాబు నాయుడు వంటి నేతలు ఒక్కొక్కరుగా ఇచ్చిన జవాబులతో జగన్ మరిన్ని ఆరోపణలకు ఆస్కారం లేకుండా పోయింది. ఈ ఎపిసోడ్ అంతా క్లుప్తంగా చెప్పాలంటే… “జగన్ ప్రశ్నలు – టిడిపి నేతల సమాధానాలు” మాదిరి తయారయ్యింది.

బోడే ప్రసాద్, గద్దె రామ్మోహన్ లపై జగన్ వ్యక్తం చేసిన ఆరోపణలకు ‘శాశ్వత రాజకీయ సన్యాసం’ సమాధానం రాగా, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నపై ఆరోపణలకు గద్దె రామ్మోహన్ బదులిచ్చారు. జగన్ చెప్తున్నట్లు బుద్ధా వెంకన్న, ఆయన సోదరుడు నాగేశ్వరరావు ఒకే ఇంట్లో నివసించడం లేదని, నాగేశ్వరరావు లబ్బీపేటలో ఉంటుండగా, వెంకన్న వన్ టౌన్ లో నివసిస్తున్నారని, గత కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరూ కలుసుకున్న సందర్భాలు లేవని, ఏ ఫంక్షన్లకు కూడా ఇద్దరూ హాజరు కారని, ఈ విషయం జిల్లా రాజకీయ వాసులందరికీ తెలుసని… జగన్ చెబుతున్నవి పచ్చి అబద్దాలని కొట్టిపడేసారు. అలాగే చంద్రబాబుతో నిందితుడు ఉన్న ఫోటోలను ప్రస్తావిస్తూ… ముఖ్యమంత్రి, మంత్రులు… అంత దాకా ఎందుకు… జగన్ తో కూడా చాలా మంది చాలా ఫోటోలు దిగి ఉంటారని, వారెవరి ముఖాన ‘నేరస్తుడు’ అని రాసిపెట్టి ఉండదని, దీనిని పట్టుకుని ఆరోపణలు చేయడం అవివేకమని మంత్రి అచ్చెన్నాయుడు చెప్తూ… సదరు నిందితుడు జగన్ తో కూడా ఉన్నారంటూ ఓ ఫోటోను చూపించారు.

టీడీపీ నేతలు వ్యక్తపరిచిన సమాధానాలతో జగన్ మరిన్ని ప్రశ్నలు వేయడానికి అవకాశం లేకుండా పోయింది. అంతేకాదు, అచ్చెన్నాయుడు వ్యక్తపరిచిన భావాలతో ఏకీభవించారు కూడా! అలాగే బోడే, గద్దె ప్రసంగాల తర్వాత కనీసం వారి పేర్లు కూడా తలచకుండా… మాట మార్చేసారు జగన్. మొత్తమ్మీద ‘కాల్ మనీ’ స్కాంతో ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామని భావించిన జగన్, అలా కాకుండా ప్రభుత్వానికి దోహదం చేసారనేది పరిశీలకుల మాట. అనుభవ రాహిత్య రాజకీయం, వాస్తవాలతో కూడిన కధనాలు కాకుండా ఊహలకు అందిన కధనాలు అల్లితే పర్యవసానాలు ఇలాగే ఉంటాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
‘ఇరికించబోయి… ఇరుక్కుపోవడమంటే…’ ఇదేనా..!