YSR Congress' double tongue in Assembly‘కాల్ మనీ’ కేసుపై చర్చ జరుగుతున్న తరుణంలో ప్రతిపక్ష నేత జగన్ తెలుగుదేశం నేతలు విజయవాడ తూర్పు నియోజక వర్గపు ఎమ్మెల్యే, పెనమలూరు ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు చేసారు. ‘కాల్ మనీ’ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న వెనిగళ్ళ శ్రీకాంత్ తో విదేశాలకు వెళ్ళిన బోడే ప్రసాద్ ఒక్కడే ఎందుకు తిరిగి వచ్చారని, పోలీసులు ఎందుకు విచారణ చేయలేదని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆరాచకలు చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే గద్దె రామ్మోహన్ నిందితుడితో కలిసి బోడే ప్రసాద్ ఆఫీసులో కలిసి ఫోటోలు దిగారని… నిందితులతో తెలుగుదేశం ఎమ్మెల్యేలకు సంబంధముందని ఇంత కంటే ఆధారాలు ఇంకేమి కావాలని మండిపడ్డారు.

దీనిపై స్పందించిన బోడే ప్రసాద్, “తన భార్య, స్నేహితులతో ఉన్న ఫోటోలను మార్ఫింగ్ చేసి, మహిళలతో కలిసి తిరుగుతున్నారని రాసే నీచ స్థితికి చేరుకున్నారని, అయినా ప్రతిపక్ష నేత ఇంతగా ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి… ఈ సందర్భంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారెని తనపై విచారణ కమిటీ వేయాల్సిందిగా కోరుతున్నానని, విచారణలో నిందితుడిగా రుజువైతే తానూ శాశ్వత రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ విసిరారు.

అలాగే గద్దె రామ్మోహన్ కూడా మాట్లాడుతూ… “పటమట సెంటర్ లో కొత్తగా ఏర్పాటైన ఒక చిన్న హోటల్ ప్రారంభోత్సవానికి వెళ్ళిన సమయంలో దిగిన ఫోటోను పట్టుకుని, జగన్ రాద్ధాంతం చేస్తున్నారని, కృష్ణాజిల్లాలో మొత్తం అయిదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారని, ఆ అయిదుగురితో జగన్ ఒక కమిటీ వేసి, ఈ ఫోటోపై విచారణ చేయమని కోరుతున్నానని, ప్రతిపక్ష నేత చెప్తున్నట్లు అది గనుక నిజమైతే తానూ రాజకీయాల్లో నుండే కాదు, ఏకంగా ఈ భూమ్మీద నుండి వెళ్ళిపోతానని తీవ్ర ఆవేదన వ్యక్తపరిచారు.

వీరిద్దరి సవాళ్ళకు స్పందించిన జగన్ వెనక్కి తగ్గక తప్పలేదు. గద్దె రామ్మోహన్ పై చేసిన ఆరోపణలను సవరించుకుంటూ… ఆఫీసో, హోటలో ఎక్కడ దిగారో తెలియదు గానీ అంటూ మాట మార్చారు. అంటే ఇప్పటివరకు ప్రతిపక్ష నేత జగన్ మరియు ఆయన కోటరీ చేసిన ఆరోపణలన్నీ “ఊహించుకున్న” కధనాలుగా తేలిపోయాయి. ఎట్టకేలకు వాస్తవాలు వెలుగు చూసాయి.